టీక‌ప్పులో పెను తుఫాన్‌

Last Updated on by

మినీ థియేట‌ర్ల కాన్సెప్టు చాలాకాలంగా ఉన్న‌దే. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డం, ఆ న‌లుగురి చేతిలో థియేట‌ర్లు ఉండ‌డంతో ఆ సిండికేట్‌ని ఏదోలా బ‌ద్ధ‌లు కొట్టేందుకు నానా ర‌కాల ప‌న్నాగాలు ప‌న్నుతున్నవాళ్లున్నారు. అయితే ప్ర‌తిదీ డ‌బ్బుతో ప‌ని. భారీ పెట్టుబ‌డుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కాబ‌ట్టి ఎవ‌రూ ఎలాంటి సాహ‌సం చేయ‌లేదు. మినీ థియేట‌ర్లు క‌ట్టేసి ఇండ‌స్ట్రీని గుప్పిట ప‌ట్టేయాల‌న్న పాచిక నెర‌వేర‌లేదు. ఎవ‌రికివారు ఉబ‌లాట‌ప‌డ‌డ‌మే కానీ ఆ ప‌నిని ప్రాక్టిక‌ల్‌గా చేసి చూపించ‌లేక‌పోయారు ఇన్నాళ్లు. తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న వెంట‌నే వ‌చ్చిన ఈ ఐడియాని ఇప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వమే అమ‌లు చేయ‌లేక‌పోయింది. ప్ర‌భుత్వ‌మే థియేట‌ర్ బిజినెస్‌లోకి దిగ‌డం ద్వారా ప్యార‌ల‌ల్ సినీవ‌రల్డ్‌ని క్రియేట్ చేయాల‌న్న ఆలోచ‌న ద‌రిమిలా ఇప్పుడు మినీ థియేట‌ర్ల ఏర్పాటున‌కు సీరియ‌స్‌గానే స‌న్నాహాలు సాగుతున్నాయ‌ని నేటి ప్ర‌క‌ట‌న తేల్చి చెప్పింది.

ఉన్న‌ట్టుండి యుద్ధ ప్రాతిప‌దిక‌న తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్టాండ్ల‌లో దాదాపు 80 నుంచి 100 మినీ థియేట‌ర్ల‌ను నిర్మించ‌నున్న‌ట్టు టీఎస్ఎఫ్‌డీసీ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. టీ- సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాద‌వ్‌ – తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు – రాష్ట్ర రోడ్లు – రవాణా శాఖ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మినీ థియేట‌ర్ల ఏర్పాటు, సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చ‌లు సాగించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. టీ- స్టేట్‌లో బ‌స్టాండ్ల‌లో స్థ‌లాలు వెత‌కాల‌ని నిర్ణ‌యించారు. ఆస‌క్తిక‌రంగా ఇదివ‌ర‌కూ ఇలా స్థ‌లాలు ఉన్నా, వాటిలో మినీథియేట‌ర్లు నిర్మించేందుకు టెండ‌ర్ల‌కు పిలిస్తే ఎవ‌రూ ముందుకు రాలేదు. అందుకే ఇప్పుడు స‌ర్కారే పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోందిట‌.

User Comments