స‌మ్మ‌ర్ 2018 ను మరచిపోవడం కష్టమే

Last Updated on by

గ‌త కొన్నేళ్ల‌లో ఈ స‌మ్మ‌ర్ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. బెస్ట్ సినిమాలు ఈ వేస‌విలోనే వ‌చ్చాయి. ప్ర‌తీసారి వేస‌వి రావ‌డం.. ఏదో ఒక్క సినిమా మాత్రం హిట్ అయి.. మిగిలినవి ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డం జ‌రుగుతాయి. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. మ‌న సినిమాల స‌త్తా ప్ర‌పంచానికి తెలిసేలా వ‌చ్చాయి కొన్ని. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 123 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. దానికితోడు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ కూడా బిత్త‌ర‌పోయేలా చేసింది. ఓవ‌ర్సీస్ లో రంగ‌స్థ‌లం దెబ్బ‌కు బాలీవుడ్ చిత్రాలు కూడా తోక ముడ‌వ‌క త‌ప్ప‌లేదు. అక్క‌డ ఏకంగా 3.5 మిలియ‌న్ వ‌సూలు చేసింది రంగ‌స్థ‌లం.

ఇక రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను కూడా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. పొలిటిక‌ల్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రంలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా న‌టించ‌డం విశేషం. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ కాక‌పోయినా.. 93 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది. 100 కోట్ల బిజినెస్ చేయ‌డంతో అబౌ యావ‌రేజ్ గా నిలిచింది భ‌ర‌త్. ఇక ఓవ‌ర్సీస్ లో రెండో 3 మిలియ‌న్ మూవీగా చ‌రిత్ర సృష్టించింది ఈ చిత్రం. అయితే రంగ‌స్ధ‌లాన్ని మాత్రం బీట్ చేయ‌లేక‌పోయింది భ‌ర‌త్ అనే నేను. ఈ స‌మ్మ‌ర్ లో భారీ అంచనాల‌తో వ‌చ్చి నిరాశ‌ప‌రిచిన సినిమాలు మాత్రం కృష్ణార్జున యుద్ధం..  నా పేరు సూర్య‌. వ‌ర‌స విజ‌యాల్లో ఉన్న నాని, బ‌న్నీ ఈ చిత్రాల‌తో త‌మ జోరుకు బ్రేకులు వేసుకున్నారు.

ఇక ఇదే స‌మ్మ‌ర్ లో మ‌రో అద్భుతం కూడా వ‌చ్చింది. దాని పేరు మ‌హాన‌టి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం అటు ప్ర‌శంస‌లు.. ఇటు పైస‌లు రెండూ తీసుకొస్తుంది. ముందు ఈ చిత్రాన్ని ఎవ‌రు చూస్తారు.. క‌మ‌ర్షియ‌ల్ గా క‌ష్ట‌మే అనుకున్నారు కానీ అమ్మ జీవితం గురించి తెలుసుకోడానికి థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు ప్రేక్ష‌కులు. పైగా కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఉండ‌టంతో మ‌హాన‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగేస్తుంది. ఓవ‌ర్సీస్ లో కూడా మ‌హాన‌టి మామూలుగా కుమ్మేయ‌డం లేదు. స‌మ్మ‌ర్ లో ఈ మూడు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాయి. కంటెంట్ తో వ‌చ్చి క‌లెక్ష‌న్ల మోత మోగించాయి. దాంతో 2018 స‌మ్మ‌ర్ తెలుగు సినిమాకు బాగా క‌లిసొచ్చింది.

User Comments