కుర్రాళ్లొచ్చారు.. కాస్త త‌ప్పుకోండ‌మ్మా..!

Last Updated on by

ఎవ‌రీ కుర్రాళ్లు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ద‌ర్శ‌కులు. 2017 కొత్త ద‌ర్శ‌కుల‌కు బాగా క‌లిసొచ్చింది. చాలా మంది కుర్రాళ్లు ద‌ర్శ‌కులుగా మారి స‌త్తా చూపించారు. వీళ్ళ‌లో ఘాజీ చేసిన సంక‌ల్ప్ ఉన్నాడు.. అర్జున్ రెడ్డి తీసిన సందీప్ రెడ్డి ఉన్నాడు.. నిన్నుకోరి అన్న శివ‌నిర్వాణ ఉన్నాడు. ఈ ఏడాది కూడా ఇలా మొద‌లైందో లేదో వ‌ర‌స‌గా కొత్త కుర్రాళ్లు మెగాఫోన్ ప‌ట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది ఎవ‌రొచ్చి తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తారా అని చూస్తోన్న వాళ్ల‌కు కొత్త ద‌ర్శ‌కుడే వ‌చ్చి రిబ్బ‌న్ క‌ట్టింగ్ చేసాడు. అత‌డే వెంకీ కుడుముల‌. ఈయ‌న తెర‌కెక్కించిన ఛ‌లో సినిమాకు టాక్ అదిరిపోయింది. ఆద్యంతం న‌వ్వులే ప్ర‌ధానంగా సాగిన ఛ‌లోలో నాగ‌శౌర్య హీరో. ఈ చిత్రం క‌చ్చితంగా శౌర్య కెరీర్ లోనే పెద్ద విజ‌యంగా మార‌డం ఖాయమైపోయింది.

ఇక చ‌లోతో పాటే వ‌చ్చిన ట‌చ్ చేసి చూడుకు కూడా కొత్త ద‌ర్శ‌కుడే. విక్ర‌మ్ సిరికొండ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. తొలి సినిమానే ర‌వితేజ లాంటి స్టార్ హీరోతో తెర‌కెక్కించే అవ‌కాశం అందుకున్నాడు విక్ర‌మ్. కానీ యూజ్ చేసుకోలేక‌పోయాడు. ఇక ఫిబ్ర‌వ‌రిలోనే వ‌స్తోన్న తొలిప్రేమ చిత్రానికి ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌వాడే. అత‌డే వెంకీ అట్లూరి. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల కానుంది. ఇక 16న విడుదల‌కు సిద్ధ‌మైన అ.. సినిమా ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌వాడే. కానీ ట్రైల‌ర్స్.. టీజ‌ర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. పైగా నాని ఈ చిత్రానికి నిర్మాత‌. ఇక అదే రోజు విడుద‌ల కానున్న మ‌రో సినిమా మ‌న‌సుకు న‌చ్చింది. దీనికి ద‌ర్శ‌కురాలు మంజుల‌. ఇలా 2018లోనూ చాలా మంది కొత్త ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీకి వ‌స్తూనే ఉన్నారు. ఇది కూడా ఇండ‌స్ట్రీ మంచికేలే. కొత్త ర‌క్తం వ‌స్తేనైనా కొత్త క‌థ‌లు పుట్టుకొస్తాయేమో..?

User Comments