Last Updated on by
2018-19 సీజన్ బయోపిక్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 50 పైగా బయోపిక్ లు తెరకెక్కడం ఇప్పటికే చర్చకొచ్చింది. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సైంటిస్టులు, క్రీడాకారుల జీవితాల్ని వెండితెరకెక్కిస్తున్నారు. అలాగే క్రీడల్లోని స్ఫూర్తిని రగిలించేందుకు క్రీడా బయోపిక్ లను మన మేకర్స్ విరివగా తెరకెక్కించడం విశేషం.
బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ క్రీడలపై ఈ తరహా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ లో పాపులరైన ముగ్గురు క్రీడాకారులపై మూడు బయోపిక్‌లు తెరకెక్కిస్తున్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ జీవితకథతో సుధీర్ బాబు టైటిల్ పాత్రలో ప్రవీణ్ సత్తారు ఓ బయోపిక్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బయోపిక్ పై తీవ్రమైన కసరత్తు సాగుతోంది. అలాగే బ్యాడ్మింటన్ క్వీన్, తెలుగమ్మాయి సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా శ్రద్ధా కపూర్ టైటిల్ పాత్రలో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి , ఒలింపిక్ క్వీన్ పివి సింధు జీవితకథలో దీపిక పదుకొనే నటించే అవకాశం ఉంది. సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అలాగే క్రికెట్ ఆటగాళ్ల పైనా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్ లపై సినిమాలు వచ్చాయి. రణవీర్ సింగ్ టైటిల్ పాత్రలో కపిల్ దేవ్ జీవితకథతో తెరకెక్కుతున్న 83 సెట్స్ పై ఉంది. రణవీర్ కెరీర్ లో ఎగ్జయిటింగ్ మూవీ ఇదని ప్రచారమవుతోంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రా జీవితకథతో తెరకెక్కే బయోపిక్ కి కన్నన్ అయ్యర్ దర్శకుడు. తండ్రి కొడుకులు అనీల్ కపూర్- హర్షవర్ధన్ కపూర్ (టైటల్ పాత్ర) నటించనున్నారు. క్రీడాకారుడు రుద్రాక్ష జేన జీవితం ఆధారంగా- అభయ్ డియోల్ టైటిల్ పాత్రలో జంగిల్ క్రై అనే చిత్రం తెరకెక్కనుంది. హకీ ఆటగాడు ధ్యాన్ చంద్ జీవితం ఆధారంగా `ధ్యాన్ చంద్` చిత్రాన్ని పూజా శెట్టి ప్రకటించారు. వరుణ్ ధావన్ టైటిల్ పాత్రలో నటించే ఈ సినిమాకి కరణ్ జోహార్ సహనిర్మాత. మహిళల టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ లేదా పీసీ నటిస్తారని తెలుస్తోంది.
User Comments