కోట్లవి.. కాస్త చూసుకో శంకరా..!

శంక‌ర్.. ఈ పేరు వింటే చాలు కోట్ల‌కు ప‌డ‌గ‌లు వ‌చ్చేస్తాయి. ఈయ‌న‌తో ఒక్క సినిమా చేస్తే చాలు అంబాని ఆస్తిని కూడా స‌గానికి దించేస్తాడు. కానీ వేస్ట్ గా మాత్రం కోట్లు ఖ‌ర్చు చేయించ‌డు ఈ ద‌ర్శ‌కుడు. ఖ‌ర్చు చేసిన ప్ర‌తీ రూపాయిని తెర‌పై చూపిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేస్తున్నాడు శంక‌ర్.

2.0 కోసం ఏకంగా 450 కోట్లు పెట్టిస్తున్నాడు శంక‌ర్. 2.0 షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యింది కేవ‌లం టాకీ పార్ట్ మాత్ర‌మే. ఈ మ‌ధ్యే మిగిలిన ఒక్క పాట‌ను చిత్రీక‌రించాడు శంక‌ర్. దీనికోసం అక్ష‌రాల 12 కోట్లు పెట్టించాడు శంక‌ర్. ఈ ఖ‌ర్చుతో నాని లాంటి హీరోతో ఓ సినిమా చేయొచ్చు. అలాంటి బ‌డ్జెట్ తో ఈయ‌న ఓ పాట చేసాడు.

హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉండ‌బోతుంది. ప్ర‌త్యేకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను ఈ చిత్రం కోసం ఇండియాకు తీసుకొచ్చాడు శంక‌ర్. ప్రతీ సీన్ హాలీవుడ్ సినిమాకు ధీటుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. 2.0లో ప్ర‌త్యేకంగా మ‌రో పాట కూడా ఉంది. దీనికోసం ఏకంగా 32 కోట్లు ఖర్చు చేయించాడు శంక‌ర్. అవును.. న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే అయినా ఇదే నిజం. ఒక్క పాట కోసం 32 కోట్లేంటి అనే క‌దా మీ అనుమానం.. ఏం లేదండీ ఈ పాట‌లో ప్ర‌పంచ స్థాయి రోబోల‌న్నింటినీ చూపిస్తున్నాడు శంక‌ర్. వాటి మ‌ధ్య ర‌జినీ, అమీ జాక్స‌న్ ల‌పై పాట చిత్రీక‌రించాడు శంక‌ర్. ఈ పాట ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ప్ర‌త్యేకంగా నిలిచిపోతుందంటున్నాడు శంక‌ర్.

ఆడియో వేడుక‌ను కూడా భారీ ఖ‌ర్చుతో ప్లాన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అక్టోబ‌ర్ 27న ఈ చిత్ర ఆడియో వేడుకను దుబాయ్ లో ప్లాన్ చేసాడు శంక‌ర్. ఈ వేడుక కోసం కూడా 15 కోట్లు ఖ‌ర్చు చేయిస్తున్నాడు శంక‌ర్. దుబాయ్ లోని ప్ర‌ఖ్యాత బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. అంతే కాదు.. ఈ వేడుక‌కు వ‌చ్చే అతిథుల కోసం ముంబై నుంచి ప్ర‌త్యేకంగా దుబాయ్ కు మూడు ఛార్టెడ్ ఫ్టైట్లు కూడా పెట్టించారు నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఆడియో విడుద‌ల పోస్ట‌ర్ల‌ను రోజుకొక్క‌టి చొప్పున విడుద‌ల చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అక్ష‌య్ కుమార్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఇత‌డి ఎంట్రీతో బాలీవుడ్ లోనూ సినిమా మార్కెట్ పెరిగింది. మొత్తానికి 2.0 ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది.

Follow US