విశాఖ రాజ‌ధానికి 3వేల ఎక‌రాలు

Jagan Announces Three Capitals for Andhra Pradesh

విశాఖ రాజ‌ధాని ప్ర‌కంప‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కొత్త రాజ‌ధానికి 3 వేల ఎక‌రాల స‌ర్వే పూర్త‌యింది. మొత్తం ఐదు ఏరియాల్లో ఈ భూమిని గుట్టు చ‌ప్పుడు కాకుండా సేక‌రించారు. అలాగే అన‌కాప‌ల్లి నుంచి భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వ‌ర‌కూ మెట్రో రైల్ ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇంకాస్త వివ‌రంగా వెళితే..

రాజధానిని అమ‌రావ‌తికి తరలించేప్పుడు తొలుత విభాగాధిపతులు విజయవాడ వచ్చారు. అనంతరం తాత్కాలిక వసతి సిద్ధం కావడంతో సచివాలయం కూడా తరలివచ్చింది. అయితే విశాఖలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఒకేసారి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు మూడు వేల ఎకరాలు సరిపోతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంతోపాటు విశాఖ రూరల్‌, భీమునిపట్నం, ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని భూములను రాజధానికి కేటాయించనున్నట్టు చెబుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా అందరికీ నగరంలో వసతి కల్పిస్తారు. ఇందుకోసం భవనాల అన్వేషణ కూడా మొదలైంది. ఈ కార్యక్రమాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని తెలిసింది. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, విభాగాధితుల్లో కొందరు కార్యాలయాల కోసం రుషికొండ ఐటీ సెజ్‌లోని భవనాలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని విభాగాలు, ఉన్నతాధికారులకు నగరం, మధురవాడ పరిసరాల్లో కొత్తగా నిర్మించిన అపార్టుమెంట్లు చూస్తున్నారు. బిల్డర్లను సంప్రదిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే భవనాల సమీకరణకు ముందుకెళ్లాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఉన్నతాధికారులకు విజయవాడలో నెలకు 40 వేలు ఇంటి అద్దె అలవెన్స్‌ ఇస్తున్నారు. బహుశా అదే మొత్తం లేదా మరికొంత పెంచి ఇవ్వవచ్చనే చర్చ అధికారుల్లో సాగుతోంది.

అనకాపల్లి – భోగాపురం మెట్రో
విశాఖ నగరంలో రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు ఉన్నందున కొత్తగా భవనాలు నిర్మిస్తే సరిపోతుందనే భావన ఉన్నత స్థాయిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టును అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మించాలనే ఆలోచన కూడా తాజాగా తెరపైకి వచ్చింది. భవిష్యత్‌లో నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునేందుకు మెట్రో దోహదపడుతుందనేది అంచనా.