టిక్కెట్టు దోపిడీ 30వేల కోట్లు

Last Updated on by

టిక్కెట్టు పేరుతో ప్రేక్ష‌కుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారా? ఇష్టానుసారం ఎగ్జిబిట‌ర్ టిక్కెట్టు ధ‌ర పెంచుకుని అధికారికంగా ఈ దోపిడీ సాగిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ప్ర‌భుత్వాల మాట‌ను సైతం భేఖాత‌ర్ చేసి ఇష్టానుసారం టిక్కెట్టు ధ‌ర పెంచుకునేందుకు కోర్టు ఆర్డ‌ర్లు తెచ్చుకుని ఏపీ, తెలంగాణ‌లో ఎగ్జిబిట‌ర్ ఆడుతున్న వింతాట‌కం ఓ రేంజులో ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌జ‌ల‌పై వినోద‌పు భారం ప‌డ‌కుండా ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌ల‌తో క‌లిసి ప్ర‌భుత్వం నిర్ణ‌యించే టిక్కెట్టు ధ‌ర య‌థాత‌థంగా అమ‌లు కావ‌డం లేదు. పైగా ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం, తెగే టిక్కెట్టుకు సంబంధించిన వివ‌రం ఏదీ డేటాబేస్‌లో నిక్షిప్తం కావ‌డం అనే విధానం లేదు కాబ‌ట్టి దోపిడీ య‌థేచ్ఛ‌గా సాగిపోతోంద‌ని చెబుతున్నారు. టిక్కెట్ల అమ్మ‌కం అంతా మ్యాన్యువ‌ల్‌గా సాగుతుంది కాబ‌ట్టి ఈ దందా య‌థేచ్ఛ‌గా సాగిపోతోంది.

2013లో ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన టిక్కెట్టు ధ‌ర‌ను సింగిల్ థియేట‌ర్‌ ఎగ్జిబిట‌ర్లు కోర్టులో ఛాలెంజ్ చేసి, త‌మ‌కు న‌చ్చిన‌ట్టు ఇష్టానుసారం పెంచేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. గ‌రిష్టంగా టిక్కెట్టు ధ‌ర రూ.90 ఉండాలి. కానీ అంత‌కంటే ఎక్కువే సింగిల్ థియేట‌ర్ ఓన‌ర్లు వ‌సూలు చేస్తున్నారు. ఓ ర‌కంగా సింగిల్ థియేట‌ర్ల‌న్నిటినీ ఆ న‌లుగురు గుప్పిట ప‌ట్టి త‌మ‌కు న‌చ్చిన‌ట్టే ఇక్క‌డ టిక్కెట్టు ధ‌ర‌ల్ని పెంచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వాల్ని, అధికారుల్ని, ఆదాయ‌ప‌న్ను శాఖ అవినీతిప‌రుల్ని మ్యానేజ్ చేస్తూ ఎగ్జిబిట‌ర్ ఆడుతున్న నాట‌కం తాజాగా బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏపీ, తెలంగాణ డివైడ్ త‌ర‌వాత కేవ‌లం నాలుగేళ్ల‌లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 వేల కోట్ల మేర టిక్కెట్టు దోపిడీ సాగింద‌ని అఖిల భార‌త సినీప్రేక్ష‌క వినియోగ‌దారుల సంఘం అధ్య‌క్షులు జీ.ఎల్‌.న‌ర‌సింహారావు ప్ర‌క‌టించారు. టిక్కెట్టు ధ‌ర పెంచుకోవ‌డానికి బ‌డ్జెట్లు పెరిగాయ‌న్న కుంటె షాకులు చెబుతూ.. లేదా థియేట‌ర్ల మెయింటెనెన్స్ పెరిగింద‌న్న షాకు చెబుతూ ఎగ్జిబిట‌ర్ చాలానే ఆట ఆడుతున్నారు. అయితే హీరోలు, సాంకేతిక నిపుణుల పారితోషికాల‌ను అడ్డ‌గోలుగా పెంచేస్తూ .. అటుపై ఆ మొత్తాన్ని టిక్కెట్టు ధ‌ర రూపంలో వ‌సూలు చేయ‌డంపైనా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ ర‌కంగా ప్రేక్ష‌కుడు ఇటు జీఎస్టీ స‌హా, హీరోల పారితోషికాల భారం మోస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు దూసుకొస్తున్నాయ్‌.

User Comments