చంద్ర‌యాన్-2 తో 45 డేస్ టెన్ష‌న్!

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39059కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌ 2ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.

శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్‌ను ఉన్నతంగా ఉంచడమే తమ లక్ష్యమని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం అనంతరం శివన్‌ మాట్లాడారు. ఇప్పటికి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపామన్నారు. అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని.. సెప్టెంబర్‌ 7న రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు.