16న హైటెక్స్‌లో ఫిలింఫేర్

ప్ర‌తియేటా ఫిలింఫేర్ ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల పేరుతో ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి తారాతోర‌ణం ఒకేచోట కొలువుదీరుతోంది. ఆరోజు ప్ర‌త్యేకంగా అలంక‌రించిన‌ వేదిక క‌న్నుల‌పండువ‌గా కాంతులీనుతోంది. వెలుగుజిలుగుల ఉత్స‌వంలో .. పెట్రోమాక్స్ లైట్స్ ఫోక‌స్‌లో అంద‌గ‌త్తెల వ‌న్నెచిన్నెలు చూసేందుకు యూత్ ప‌డి ప‌డి చ‌స్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌న‌సే ఒక బృందావ‌నం అని సాంగేసుకుంటారంతా.
ఈసారి కూడా అలాంటి ఉత్స‌వాల‌కు వేదిక సిద్ధ‌మ‌వుతోంది. ఏటేటా వీలును బ‌ట్టి మెట్రో న‌గ‌రాల్లో ఈ వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది హైద‌రాబాద్ హైటెక్స్‌(హెచ్ఐసీసీ -నోవాలెట్‌)లో ఫిలింఫేర్ సౌత్ 2017 ఉత్స‌వాల్ని వేడుక‌గా నిర్వ‌హించారు. ఈసారి 65వ‌ ఫిలింఫేర్ సౌత్ 2018 ఉత్స‌వాలకు అదే వేదిక‌పై ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. నిన్న‌టిరోజున అందాల త్రిష చెన్న‌య్‌లో ఫిలింఫేర్ ఉత్స‌వాల క‌ర్టెన్‌రైజ‌ర్‌లో పాల్గొంది. జూన్ 16న వేడుక‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. 2017 తెలుగు సినిమాల్లో వేటికి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఫిలింఫేర్‌లు ద‌క్క‌నున్నాయో.. ఎవ‌రెవ‌రు అవార్డులు అందుకుంటారోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.