7నందులు కాదు 700కోట్ల‌ట‌!

హెబ్బా ప‌టేల్, ఆదిత్ జంటగా `మిణుగురులు` ఫేం అయోధ్య కుమార్ తెర‌కెక్కించిన `24కిస్సెస్` న‌వంబ‌ర్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లాలో జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిత్ర‌యూనిట్‌కి మంచు ల‌క్ష్మి త‌న‌దైన శైలిలో బ్లెస్సింగ్ ఇవ్వ‌డం విశేషం.

ఈ సినిమాకి 7 నందులొచ్చాయి.. జాతీయ అవార్డు అందుకున్నారు.. ఈసారి అవార్డులు కాదు 700కోట్లు రావాలి.. అంటూ బ్లెస్ చేసింది మంచు వార‌మ్మాయి. ఆస‌క్తిక‌రంగా మిణుగురులు లాంటి క్లాసిక్ సినిమా తీసినా రాని గుర్తింపు అయోధ్య కుమార్‌కి ఇప్పుడు వ‌చ్చింది అంటే దీన‌ర్థం .. క‌చ్ఛితంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ప‌వ‌ర్ అనే చెప్పాలి. అమెరికాలో ఐటీ వృత్తి వ‌దిలి అసంతృప్తితో వ‌చ్చేశాడు సినిమాలు చేసేందుకు. తీరా ఇక్క‌డికొచ్చాక ఆయ‌న‌కు తెలిశాయి అస‌లు క‌ష్టాలు. ఇదే వేదిక‌పై అయోధ్య కుమార్ త‌నకు అయిన అనుభ‌వంపై మాట్లాడుతూ -“మిణుగురులు కోసం మూడేళ్లు శ్ర‌మించాను.. చాలా అవార్డులు వ‌చ్చాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశాన‌ని ప్ర‌శంసించారు. అయితే దాని త‌ర్వాత మ‌ళ్లీ ఒక‌టి నుంచే మొద‌ల‌వ్వాల్సి వ‌చ్చింది. ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. మిణుగురులు రిలీజ్ ముందు డిస్ట్రిబ్యూట‌ర్లు, సినిమా ప్ర‌ముఖుల‌కు 45 షోలు వేశాను. బావుంద‌ని పొగిడిన వాళ్లే. కానీ ఒక్క‌రూ కొన‌డానికి ముందుకు రాలేదు. ఒకాయ‌న‌ 1కోటి ఇస్తాన‌ని ముందుకొచ్చారు. అది గ‌తానుభ‌వం. ఇప్పుడు 24 కిస్సెస్ చిత్రాన్ని ఒక్క‌రికి కూడా చూపించ‌లేదు. అన్ని ఏరియాల నుంచి పోటీ నెల‌కొంది. ఒక్కో ఏరియా నుంచి ప‌ది మంది పోటీప‌డుతున్నారు. బెంగ‌ళూరు నుంచి ఫోన్లు వ‌స్తున్నాయి. ఎంతో న‌మ్మ‌కంతో నైజాం నేనే రిలీజ్ చేస్తున్నా. 50 మంది డిస్ట్రిబ్యూట‌ర్లు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉన్నా. పాత త‌ప్పు చేయ‌కుండా ముందుకెళుతున్నా“ అని అన్నారు. మొత్తానికి ఆ క‌సిని ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ పంథా సినిమా తీసి ఇలా తీర్చుకుంటున్నార‌న్న‌మాట‌!!