జగన్ కు ఏడు కోట్లు విరాళం! ఎవరీ మహిళ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చేయూతనందించారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ. సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు విజయవంతంగా అమలు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నత్త రామేశ్వరంకు చెందిన పడాల కస్తూరి కోట్లాది రూపాయల విలువైన భూమిని వైయస్ జగన్ ప్రభుత్వానికి అందజేశారు.

పడాల కస్తూరి తన కుమారుడు పడాల కనికిరెడ్డి గుర్తుగా రూ.7కోట్లు విలువ చేసే ఎకరా పది సెంట్ల భూమిని వైయస్ జగన్ కు అప్పగించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఇచ్చినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఇకపోతే పడాల కస్తూరి లండన్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే జిల్లాకు వచ్చిన ఆమె ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజును కలిసి తన మనసులో మాట చెప్పారు. దీంతో సీఎం అపాయింట్మెంట్ తీసుకున్న మంత్రి రంగనాథరాజు నేతృత్వంలో ఆ భూమిని వైయస్ జగన్ కు అప్పగించారు కస్తూరి. తాను ఇచ్చిన భూమిని నవరత్నాలులోని పేదల గృహ నిర్మాణానికి వినియోగించాల్సిందిగా సీఎం వైయస్ జగన్ ను కోరారు దాత పడాల కస్తూరి. కోట్లాది రూపాయలు విలువచేసే భూమిని ప్రభుత్వానికి అందజేసినందుకు ఆమెను పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అభినందించారు.

Also Read: Nri Women Donates Land Worth 7 Crores To Cm