8 సినిమాలు ఒకేసారి?

మా సినిమాకు థియేట‌ర్లు ఇవ్వ‌డం లేదు. దాని వ‌ల్ల ఆడాల్సిన సినిమా ఆడ‌లేదు. దాంతో భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఇలా గ‌త కొంత కాలంగా చాలా మంది నిర్మాత‌లు చెబుతున్న మాట‌లివి. థీయేట‌ర్లు దొర‌క‌లేద‌ని, మా చిత్రానికి మంచి థియేట‌ర్లు కేటాయించ‌లేద‌ని ల‌బోదిబోమంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నానా ర‌చ్చ చేస్తుండ‌టం తెలిసిందే. అయితే ఒకేసారి విరుచుకుప‌డ‌టం వ‌ల్ల థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌న్న చిన్న లాజిక్‌ను మాత్రం మ‌ర్చిపోతుంటారు.


స‌రిగ్గా ఇలాంటి లాజిక్‌ని మ‌రిచిన ఎనిమిది మంది నిర్మాత‌లు మాత్రం త‌మ 8 చిత్రాల్ని ఒకేసారి విడుద‌ల చేస్తూ థియేట‌ర్ల వారికి టెన్ష‌న్ పుట్టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నెల 22న 8 చిత్రాలు రిలీజ్‌కు పోటీప‌డుతున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది నిర్మాత‌లు థియేట‌ర్స్ గురించి ప‌ట్టించుకోకుండా రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించేశారు. శ్రీ‌నివాస‌రెడ్డి కొంత విరామం తరువాత చేస్తున్న రాగ‌ల 24 గంట‌ల్లో చిత్రాన్ని ఈ నెల 22నే రిలీజ్ చేయ‌బోతున్నాడు.


ఇదే రోజున ఓయూ స్టూడెంట్ లీడ‌ర్ జార్జిరెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న‌ జార్జిరెడ్డితో పాటు ట్రాప్‌, రాజా న‌ర‌సింహా, ర‌ణ‌స్థ‌లం, బీచ్ రోడ్ చేత‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన తోలుబొమ్మ‌లాట‌, 21న జ్యోతిక నటించిన జాక్‌పాట్‌ చిత్రాలు పోటీపడుతున్నాయి. అయితే ఈ సినిమాల్లో నాలుగు చిత్రాలు రిలీజ్ డేట్‌ల‌ని మార్చుకునే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే వీరికి బయ్య‌ర్ల నుంచి ఎగ్జిబిట‌ర్ల నుంచి ఒత్తిడి మొద‌లైన‌ట్టు చెబుతున్నారు.