పురుష సంఘం బ‌స్తీ మే స‌వాల్

న‌టుడు, ద‌ర్శ‌క‌, నిర్మాత భాగ్యరాజ్ ఇటీవ‌ల త‌మిళ‌నాడులో ఓ సినిమా వేడుక‌లో మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌లు ధ‌రించే వ‌స్త్రాల ప‌ట్ల కాస్త జాగ్ర‌త్త వ‌హిస్తే ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వ‌ని, త‌ప్పులు జ‌ర‌గ‌డానికి కార‌ణం కొంత మంది మ‌హిళ‌లు అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న‌పై గాయ‌ని చిన్మ‌యి స‌హా త‌మిళ‌నాడు మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. మ‌హిళ‌ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడుతావా? ఆడ‌వాళ్ల‌కు నీతులు చెబుతావా? అంటూ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసారు. అటుపై భాగ్య‌రాజ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. తెలుగు రాష్ట్రాల్లోని మ‌హిళా సంఘాలు భాగ్య‌రాజ‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసాయి.

ఈ నేప‌థ్యంలో  భాగ్య‌రాజు  ఒక్క‌డిగానే న్యాయ పోరాటం చేస్తున్నాడు. దీంతో ఆయ‌న‌కు మ‌ద్దుతుగా త‌మిళ‌నాడు  పురుషుల సంఘం( త‌మిళ‌నాడు ఆన్గ‌ల్ పాదుగాప్పు) బ‌రిలోకి దిగింది. పురుషులంతా క‌లిసి త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఆడ‌పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్ప‌డం త‌ప్పా?! అని మ‌హిళా సంఘాల తీరుపై పురుష సంఘం మండి ప‌డింది. హ‌క్కులు అంటూ ముంద‌కొచ్చే ముందు హ‌ద్దుల‌నేవి కొన్ని ఉంటాయి వాటిని మ‌ర్చిపోతే ఎలా? అని ప్ర‌శ్నించాయి. భాగ్య‌రాజ్ చేసిన వ్యాఖ్య‌ల్లో ఏ మాత్రం త‌ప్పు లేద‌ని న్యాయ పోరాటానికి మేము సిద్దంగా ఉన్నామ‌ని భాగ్య‌రాజ్ కు పురుషుల సంఘం భ‌రోసా క‌ల్పించింది.