ఆ న‌లుగురు ఎల్ఎల్‌పీ భూతం కంచికి

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో గ‌త రెండేళ్లుగా ఎల్ఎల్‌పి గ్రూప్ సంచ‌ల‌నంగా మారింది. ఆ న‌లుగురు పెద్ద‌లు ఒక‌టిగా క‌లిసి ఈ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో వున్న నిర్మాత‌ల్ని రెండు వ‌ర్గాలుగా చీల్చింది. ఒక వ‌ర్గం భారీ చిత్రాలు నిర్మిస్తూ కోట్ల‌ల్లో దండుకుంటుంటే మ‌రో వ‌ర్గం చిన్న చిత్రాల వైపు దృష్టి సారించింది. నిర్మాత‌ల మండ‌లిలో ఒకే గొడుగు కింద‌ నిర్మాత‌ల‌కు రెండు గ్రూపులు అవ‌స‌ర‌మా?. ఎవ‌రిని ఉద్ధ‌రించ‌డానికి అంటూ రెండు వ‌ర్గాల మ‌ధ్య కొంత కాలం పెద్ద ర‌చ్చే జ‌రిగింది. ఇక ఎల్ ఎల్ పి గ్రూప్ అంటూ త‌మ‌కు న‌చ్చిన మీడియా సంస్థ‌ల‌కే సినిమాల ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ హ‌డావిడి చేశారు.

ఇది నిన్న‌టి మాట ఇప్పుడు ఆ కూట‌మి కూలుతోంది. గ‌త కొంత కాలంగా దిల్‌రాజు అండ‌దండ‌ల‌తో అడ్డూ అదుపూ లేకుండ సాగిన ఎల్ఎల్ పీ బాగోతానికి తెర‌ప‌డబోతోంది. సినిమా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వ‌సూలు చేసిన క‌మీష‌న్‌ల విష‌యం నుంచే ఎల్ ఎల్ పి పై ఆ వ‌ర్గం నిర్మాత‌లే రగ‌డ మొద‌లుపెట్టారు. దీని వ‌ల్ల మీడియాకు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య అగాధాన్ని సృష్టిస్తున్నారంటూ కొంత మంది నిర్మాత‌లు ఘాటుగానే స్పందించారు. అయినా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించిన ఎల్ ఎల్ పీ కీల‌క వ‌ర్గం తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తాము పెట్టిన కుంప‌టి కూలుతోంద‌నే సంకేతాల్ని అందిస్తున్నాయి. ఎల్ ఎల్ పీ వ‌ర్గం ప‌లు మీడియా సంస్థ‌ల‌కు భారీగానే బ‌కాయిలు ప‌డింద‌ట‌. దీంతో చేతులెత్తేసిన స‌ద‌రు మీడియా సంస్థ‌లు ఇక నుంచి డ‌బ్బులు చెల్లిస్తేనే ప్ర‌క‌ట‌న‌లు వేస్తామ‌ని భీష్మించుకుని కూర్చున్నార‌ని, చేసేది లేక మిగ‌తా నిర్మాత‌ల త‌ర‌హాలోనే ఎల్ ఎల్ పిలోని నిర్మాత‌లు సొంతంగా ఛాంబ‌ర్ నిర్ణ‌యించిన అమౌంట్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే ఎల్ ఎల్ పీ సూత్ర‌ధారి దిల్ రాజు నోరు విప్పాల్సిందే.

User Comments