ఏబిసిడి మ‌ళ్లీ వాయిదా?

అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఏబిసిడి` రిలీజ్ మ‌ళ్లీ వాయిదా ప‌డిందా? అంటే అవున‌న తెలుస్తోంది. అల్లు వార‌బ్బాయి థియేట‌ర్ల‌లోకి ఎప్పుడొద్దామా! అని క్యూరియ‌స్ గా ఎదురుచూస్తోన్న ఆ స‌మ‌యం మాత్రం వెన‌క్కి వెన‌క్కి వెళ్ల‌క త‌ప్ప లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన సినిమా ఎట్ట‌కేల‌కు ఈనెల 21న రిలీజ్ చేయ‌డం ఖాయ‌మ‌ని యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ ఇప్పుడా తేదీకి కూడా రావ‌డం లేద‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. నిర్మాణానంత‌ర ప‌నుల్లో జాప్యం చోటుచేసుకోవ‌డం వ‌ల్ల ఏప్రిల్ 12కు వాయిదా వేసారుట‌. వాయిదా ప‌డిన ప్ర‌తీసారి యూనిట్ నుంచి ఇదే కార‌ణం చెబుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో? అయితే ఇక్క‌డో విష‌యం గురించి త‌ప్ప‌క మాట్లాడాలి.

ఈనెలంతా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ తో బిజీ. అంతా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతున్నారు. ఈ టెన్ష‌న్ నుంచి రిలీవ్ అవ్వాలంటే ఏప్రిల్ 15 వ‌చ్చేస్తుంది.ఇదే మ‌రో వారంలో ఏపిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల‌వుతోంది. మెగా అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పార్టీ ప్ర‌చార‌ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. మెగా క్యాంపు హీరో సినిమా అంటే ఈ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌నిసరి. వాళ్ల అభిమానం చూప‌నిదే థియేట‌ర్లో మినిమం టిక్కెట్లు కూడా తెగ‌వు. మ‌రి వీట‌న్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిరీష్ వెన‌క్కి త‌గ్గుతున్నాడా? అనే సందేహం ఎన‌లిస్టుల‌కు క‌లుగుతోంది. ఈ చిత్రం మ‌ల‌యాళం సినిమా రీమేక్ రూపం అన్న సంగ‌తి తెలిసిందే.