అభిమన్యుడు రివ్యూ

Last Updated on by

రివ్యూ: అభిమన్యుడు

నటీనటులు: విశాల్, సమంత, అర్జున్, డిల్లీ గణేష్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పిఎస్ మిత్రన్

నిర్మాత: విశాల్.. లైకా ప్రొడక్షన్స్

విశాల్ సినిమా అంటే ఒకప్పుడు యాక్షన్ సినిమా అని ఊరుకునేవాళ్లు కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లో కథ కూడా అలాగే ఉంది. కొత్త కథలు ట్రై చేస్తూ వరస విజయాలు అందుకుంటున్నాడు ఈ మాస్ హీరో. ఇప్పుడు కూడా డిజిటల్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి చెప్పడానికి అభిమన్యుడు అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? అలరించిందా..?

కథ:

కరుణాకర్ (విశాల్) ఇండియన్ మిలటరీ మేజర్. కానీ కోపం ఎక్కువ. ఓ సారి ఓ కేస్ లో ఓ బ్యాంక్ ఉద్యోగిని కొట్టి ఓ సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ లతాదేవి(సమంత). ఆమెతో క్లీన్ చీట్ తీసుకుంటే తప్ప ఆర్మీలోకి ఎంట్రీ ఉండదని తేలుతుంది. దాంతో రోజూ వచ్చి కోపం తగ్గించుకునే పనిలో ఉంటాడు కర్ణాకర్. అదే సమయంలో చెల్లి పెళ్లి కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటాడు కర్ణ. కానీ అనుకోకుండా అకౌంట్ లో పడిన తర్వాతి నిమిషంలోనే మాయమైపోతుంది. అలా ఒక్కరి డబ్బు కాదు.. కొన్ని వేల మంది డబ్బును అక్రమంగా తమకే తెలియకుండా దొంగిలిస్తుంటాడు వైట్ డెవిల్ అలియాస్ సత్యమూర్తి(అర్జున్). అక్కడ్నుంచి తన డబ్బుతో పాటు అందరి డబ్బును కర్ణ ఎలా తీసుకొచ్చాడు అనేది అసలు కథ.

కథనం:

ఆర్మీ మేజర్.. కోపం ఎక్కువ.. ఒకర్ని కొట్టడం.. సీనియర్ ఆఫీసర్స్ తో చివాట్లు తినడం.. సర్టిఫికేట్ కోసం సైక్రియాటిస్ట్ దగ్గరకు రావడం ఇవన్నీ ఈ మధ్యే నా పేరు సూర్యలో చూసినట్లు గుర్తు కదా..! సరిగ్గా ఇదే జరుగుతుంది అభిమన్యుడులో కూడా కాసేపు. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. నా పేరు సూర్య డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కథ గంగలో కలిసిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అసలు కథే అక్కడే మొదలు అవుతుంది. డిజిటల్ క్రైమ్.. సైబర్ నేరగాళ్లు అనే పెద్ద నెట్ వర్క్ ను ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు మిత్రన్. ఇలాంటి కథను చెప్పాలంటే అంత చిన్న విషయం కాదు.. దానికి స్క్రీన్ ప్లే చాలా పక్కాగా ఉండాలి.

ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులకు అర్థం కాదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మిత్రన్. ఫస్ట్ సీన్ నుంచే పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా.. ఇంకెక్కడా కథ దారి తప్పకుండా అల్లుకున్నాడు. అకౌంట్ లోంచి పడిన డబ్బులు అకౌంట్ నుంచి మాయం అవడం అనేది హీరోకు వచ్చేవరకు తెలియకపోవడం.. అక్కడ్నుంచి అది ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఇష్యూగా మారడం.. తన డబ్బుతో పాటు మోసపోయిన అందరి డబ్బును హీరో వెనక్కి తీసుకొచ్చే క్రమంలో మనకే తెలియని నిజాలను చూపించాడు దర్శకుడు. అసలు మనం నిత్యం లైఫ్ లో చేసే చిన్న చిన్న తొందరపాటు పనులు మన జీవితాలను ఎంతటి రిస్క్ లో పడేస్తున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. మనం వాడే స్మార్ట్ ఫోన్ కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుందని చూపిస్తుంటే వెన్ను లో వణుకు పుట్టకుండా ఉండదు.
సైబర్ క్రైమ్ ఎలా చేస్తారు అనే విషయాన్ని చాలా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో మార్గాలు కూడా చూపించాడు. బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్.. లోన్ కోసం చేసే పనులు.. ఫోన్ లో మాటలు.. ఇలా అన్నీ డిజిటల్ క్రైమ్ కు మనమే ఆధారంగా ఇస్తున్నాం అని చూపించాడు. ముఖ్యంగా ఆధార్ కార్డ్ తో కూడా అన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఇందులో కథ కంటే ఎక్కువగా మన జీవితమే మనకు కనిపిస్తుంటుంది. స్క్రీన్ ప్లే జోడించి చివరి సీన్ వరకు దాన్ని ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు మిత్రన్.

నటీనటులు:

విశాల్ ఎప్పట్లాగే తన పాత్రకు ప్రాణం పోసాడు. రోబోటిక్ మాస్ హీరో ఇమేజ్ నుంచి అద్భుతమైన నటుడిగా మారుతున్నాడు విశాల్. ఆర్మీ ఆఫీసర్ గా ఎంత రూడ్ గా ఉన్నాడో.. డిజిటల్ క్రైమ్ ను చేధించే క్రమంలో అంతే పక్కా ఆర్మీ మ్యాన్ గా అనిపించాడు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి ప్రాణం. ఇతడి పాత్ర కాస్త ఆలస్యంగా కథలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇచ్చిన తర్వాత ఇంకెవరూ కనిపించలేదు. క్లైమాక్స్ వరకు ఆయనదే రాజ్యం. సమంత బాగా చేసింది. డాక్టర్ గా మెప్పించింది. హీరో తండ్రిగా ఢిల్లీ గణేష్ పర్లేదు. మిగిలిన వాళ్ళంతా కథకు తగ్గట్లుగా అప్పుడప్పుడూ వచ్చి వెళ్లే పాత్రలే.

టెక్నికల్ టీం:

ఈ చిత్రానికి నూటికి నూరు మార్కులు సంపాదించింది యువన్ శంకర్ రాజా. ఈయన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. రెండున్నర గంటల కంటే ఎక్కువగానే ఉన్నా ఎక్కడా బోర్ అనిపించదు. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక దర్శకుడు మిత్రన్ గురించి చెప్పాలి.. ఈయన తీసుకున్న కథపై చేసిన స్టడీ ఏంటో సినిమా చూస్తే అర్థమైపోతుంది. ప్రతీ సీన్ ను పక్కాగా రాసుకున్నాడు. ఎక్కడా చిన్న డౌట్ కూడా రానివ్వలేదు ప్రేక్షకుల బుర్రల్లో. అయితే పాటలు అసందర్భంగా రావడం.. అనవసరపు కామెడీకి ట్రై చేయడం ఒక్కటే సినిమాకు కాస్త మైనస్.

చివరగా:

అభిమన్యుడు.. మేలుకో వినియోగదారుడా మేలుకో..

రేటింగ్: 2.75/5

User Comments