ఈ లెజెండ్ ని ప్ర‌భుత్వాలు గుర్తించ‌వా?

Last Updated on by

నేడు ఏదైనా సినిమా హిట్ట‌యితే క‌థా బ‌లం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌న హీరోలంతా మంచి క‌థ‌ల వెంట ప‌డుతున్నారు. అయితే ఈ విధానానికి టాలీవుడ్ తొలి నాళ్ల‌లోనే పునాదులు వేసిన అరుదైన నిర్మాత‌గా ఏడిద నాగేశ్వ‌ర‌రావు పేరు చ‌రిత్ర‌లో సుస్థిర‌మైంది.
శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపద్భాంధవుడు, సితార , సీతాకోకచిలుక మొదలగు కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన మేటి టాలీవుడ్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు . కెరీర్‌ లో ఆణి ముత్యాల్లాంటి చిత్రాల‌ను నిర్మించారు. 24 ఏప్రిల్.. ఆయ‌న 84వ జ‌యంతి సంద‌ర్భ ంగా ఓ మారు ఆయ‌న చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే..

కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొనసాగించారు. అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరిసిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇచ్చిన‌ ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం. తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు, బాక్సాఫీస్ కలెక్షన్స్ గానీ , జాతీయ – అంతర్జాతీయ – రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే అతిశయోక్తి కాదు.

జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రంగా శంకరాభరణం పేరొందింది. అలాగే ఏ దేశానికి వెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం , మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ – సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా. సితార చిత్రానికి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది.

ఇక స్వాతిముత్యం – కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం. 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి – మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద. మంచి విజయం సాధించిన ఈ చిత్రం, చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరోగా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు. మళ్ళీ విశ్వనాధ్ – చిరంజీవిలతో తీసిన చిత్రం , ఆపద్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి , మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే. పద్మ అవార్డుల్లో కానీ , రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే . కనీసం కీర్తిశేషులైన తర్వాత ఆయనకీ తగిన విధముగా పురస్కారం ద‌క్కేలా ప్ర‌భుత్వాలు కృషి చేస్తాయేమో చూడాలి. చేయాల‌నే అభిమానులు కోరుకుంటున్నారు.

User Comments