ఆచారి అమెరికా యాత్ర‌ రివ్యూ

రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర‌
న‌టీన‌టులు: మ‌ంచు విష్ణు, ప్ర‌గ్య‌జైస్వ‌ల్, బ్ర‌హ్మానందం, ప్ర‌వీణ్ కుమార్, ప్ర‌భాస్ శీను త‌దిత‌రులు
నిర్మాత‌: ఎంఎల్ కుమార్ చౌద‌రి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కత్వం: జి నాగేశ్వ‌ర‌రెడ్డి

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ కామెడీ సినిమాల‌తో మాత్రం బాగానే న‌వ్వించాడు విష్ణు. ఈయ‌న‌కు ఆ కామెడీ బాగానే అచ్చొచ్చింది కూడా. దాంతో ఇప్పుడు మ‌రోసారి అదే చేయాల‌ని చూసాడు. ఆచారి అమెరికా యాత్ర అంటూ వ‌చ్చాడు. మ‌రి ఈయ‌న యాత్ర ఎలా ఉంది..?

క‌థ‌:
కృష్ణ‌మాచారి(విష్ణు).. అప్ప‌లాచారి(బ్ర‌హ్మానందం) గురు శిష్యులు. ఓ ఇంట్లో హోమం చేయ‌డానికి వ‌చ్చి అక్క‌డ అనుకోకుండా ఆ ఇంటిపెద్ద చావుకు కార‌ణం అవుతారు. దాంతో ఆ ఇంటి వాళ్లు ఈ ఇద్ద‌ర్నీ చంప‌డానికి చూస్తారు. ఏం చేయాలో తెలియ‌క అమెరికాకు పారిపోతారు కృష్ణ‌మాచారి గ్యాంగ్. అక్క‌డే రేణుక‌(ప్ర‌గ్య‌జైస్వ‌ల్) ను చూస్తాడు కృష్ణ‌మాచారి. కానీ అమెరికాకు కృష్ణ‌మాచారి వ‌చ్చింది పారిపోయి కాదు.. ఇండియాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల్ల అని త‌ర్వాత తెలుస్తుంది. అంతేకాదు.. రేణుక కూడా ముందే కృష్ణ‌కు తెలుసు. అస‌లు ఈ ఇద్ద‌రికి ప‌రిచ‌యం ఏంటి..? ఏం జ‌రిగింది..? ఎందుకు వాళ్లు అమెరికాకు పారిపోయి వ‌చ్చారు..? అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
దేనికైనా రెడీలో ఆల్రెడీ ఓ సారి బ్రాహ్మ‌ణ పాత్ర‌లు చేసి క‌న్ఫ్యూజింగ్ కామెడీతో న‌వ్వించారు విష్ణు అండ్ గ్యాంగ్. మ‌రోసారి ఇదే చేయాల‌ని చూసారు. కానీ ఈ సారి మాత్రం వాళ్ల ప్లాన్ స‌రిగ్గా వ‌ర్కవుట్ కాలేదు. ప్ర‌మాదంలో ఉన్న హీరోయిన్ ను హీరో వ‌చ్చి కాపాడేయ‌డం.. హీరోయిన్ పేరు మీదున్న కోట్ల ఆస్తి కోసం విల‌న్లు ట్రై చేయ‌డం.. ఇదే సింపుల్ గా చెప్పాలంటే ఆచారి అమెరికా యాత్ర క‌థ‌. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో చూసాం ఈ క‌థ‌ను. ఇక్క‌డ క‌నీసం కామెడీతోనైనా క‌వ‌ర్ చేస్తాడేమో అనుకుంటే.. మ‌రోసారి అదే రొటీన్ స్క్రీన్ ప్లేతో పీల‌గా మార్చేసాడు సినిమాను నాగేశ్వ‌ర‌రెడ్డి. పైగా అమెరికా సీక్వెన్సులు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌కు కూడా స్కోప్ లేదు. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లే మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపించ‌డంతో ఆచారి ఏ కోశానా కూడా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే చేయ‌దు. బ‌ల‌వంతంగా న‌వ్వాల్సిందే కానీ ఎక్క‌డా కామెడీ వ‌ర్కవుట్ అయితే కాలేదు. ఫ‌స్టాఫ్ అంతా హీరో బ్యాచ్ అమెరికా క‌ష్టాల‌తోనే స‌రిపోయింది. క‌థ‌లోకి వెళ్లినా అక్క‌డ క‌థేం లేద‌ని తెలిసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు ఓ నిట్టూర్పు త‌ప్ప‌దు.

న‌టీన‌టులు:
విష్ణు న‌ట‌న గురించి చెప్పాల్సిందేమీ లేదు. మ‌రోసారి బ్రాహ్మ‌ణ పాత్ర‌లో బాగా న‌టించాడు. కానీ ఈయ‌న బాడీ లాంగ్వేజ్ ఏ త‌ర‌హా పాత్ర‌లు సూట్ అవుతాయో ఆయ‌నే ఇక‌నైనా తెలుసుకోవాలి. ప్ర‌గ్య‌జైస్వ‌ల్ కేవ‌లం అందాల ఆర‌బోత కోస‌మే ఉంది. ఇంకెందుకు కాదు. బ్ర‌హ్మానందం మ‌రోసారి త‌న‌కు అల‌వాటైన పాత్ర‌లో న‌టించేసాడు. కామెడీ గురించి ఆరా తీయొద్దు. ప్ర‌వీణ్, ప్ర‌భాస్ శీను కూడా మ‌మా అనిపించేసారు. విల‌న్ గా అనూప్ సింగ్ ఠాకూర్ జ‌స్ట్ బొమ్మ‌లా నిల‌బ‌డిపోయాడు. పోసానీ, కోట ఉన్నంత‌లో ప‌ర్లేదు. మిగిలిన వాళ్ళంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ ఈ మ‌ధ్య కాస్త కొత్త‌గా మ్యూజిక్ ఇస్తున్నాడు. కానీ ఇది ఇప్ప‌టి సినిమా కాదు క‌దా.. అందుకే ఇందులో పాత థ‌మ‌న్ క‌నిపించాడు. అవే పాత ట్యూన్స్ తో రోత పుట్టించాడు. ఆర్ఆర్ కూడా ఎక్క‌డో విన్న‌దే. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. చాలా చోట్ల సీన్లు ట‌ప్ అని క‌ట్ అయిపోయాయి. పైగా అమెరికా, ఇండియా మ‌ధ్య వ‌చ్చే సీన్స్ క‌లిసిపోయాయి. ఏది ఎక్క‌డ జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ద‌ర్శ‌కుడిగా నాగేశ్వ‌ర‌రెడ్డి మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. ఈయ‌న క‌న్ఫ్యూజ‌న్ కామెడీని న‌మ్ముకున్నా ఈ సారి మాత్రం వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు.

చివ‌ర‌గా:
ఆచారి అమెరికా యాతరా.. వాళ్లు చెప్పిన‌ట్లే గ్రహచారం ఆడిన ఆట‌రా..

రేటింగ్:2/5