షాక్ మీద షాక్.. హీరో థియేటర్ కూడా క్లోజ్

Actor Dileeps multiplex closed

మలయాళ నటి పై దాడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కొందరు దుండగులు నటిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేయడానికి ప్రయత్నించి దాడి చేయడం వంటి వన్నీ దిలీపే వెనకుండి స్కెచ్ వేసి నడిపించాడని ఇప్పటికే నిజమని తేలేలా మలయాళ వర్గాలు వార్తలు కూడా ప్రచారం చేస్తున్నాయి. దీంతో షాక్ లోనే ఉన్న దిలీప్ జైల్లో కూర్చుని బెయిల్ వస్తుందో రాదో అంటూ భజన చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దిలీప్ కు మరో షాక్ తగలడం గమనార్హం. ఆ స్టోరీలోకి వెళితే, కేరళ లోని కొచ్చిన్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలకుడి అనే ఊరులో హీరో దిలీప్ కు ‘డి సినిమాస్’ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ఉందట.
ఆ ఊరికి పర్యాటకులు విపరీతంగా వస్తారనే కారణంతో దిలీప్ అక్కడ మల్టీప్లెక్స్ కట్టుకుని బాగానే లాభాలు ఆర్జిస్తున్నారని సమాచారం. అయితే, అప్పట్లో ఆ థియేటర్ కట్టిన భూమిని అక్రమంగా లాక్కున్నారంటూ చాలా ఆరోపణలు వస్తే.. దిలీప్ తనకున్న పలుకుబడితో సైలెంట్ చేసేసాడట. కానీ ఇప్పుడు దిలీప్ జైల్లో ఉండటంతో.. ఆ థియేటర్ కు సంబంధించి భూమిపై ఉన్న వివాదాలు తొలిగేవరకు దానిని మూసేయాలని చాలకుడి మున్సిపాలిటీ డిసైడ్ అయిందట. దీంతో ఇప్పుడు పోలీసులు ఆ భూమి గురించి ఏదో ఒకటి తేల్చేవరకు మల్టీప్లెక్స్ ను తెరవడానికి వీల్లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఇప్పుడు దిలీప్ కు షాక్ మీద షాక్ తగిలినట్లు అయింది. ఓవైపు తన లాయర్లతో బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోన్న దిలీప్ కు బయట ఇలాంటి షాక్ లు రెడీగా ఉండటం నిజంగా విశేషమే. ఇకపోతే, నటిపై అత్యాచారయత్నం దాడికి సంబంధించి కేసు విచారణ పూర్తిగా ఓ కొలిక్కి వస్తే గాని దిలీప్ కు బెయిల్ రాదనే వాదన గట్టిగానే వినిపిస్తుంది.