అయ్యో పాపం.. ఇక్క‌డ అద‌ర‌లేదే..!

అదిరింది.. అదిరింది.. అని టైటిల్ పెట్టుకున్నాడు కానీ అద‌ర‌లేదు ఇక్క‌డ‌. విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మెర్స‌ల్ తెలుగులో అదిరింది పేరుతో డ‌బ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 18నే విడుదల కావాల్సింది కానీ 19కి వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు అక్టోబ‌ర్ 19కి కూడా రావ‌ట్లేదు అదిరింది. ఈ చిత్రం వ‌చ్చే వారానికి వాయిదా ప‌డిపోయింది. దానికి కార‌ణం ఇంకా సెన్సార్ పూర్తి కాక‌పోవ‌డ‌మే. త‌మిళ సినిమాకే సెన్సార్ అక్టోబ‌ర్ 17 సాయంత్రం అయింది. ఇందులో విజ‌య్ మెజీషియ‌న్ గా న‌టించాడు. ఈ పాత్ర కోసం పావురాలు, పాముల‌ను నిజంగా వాడారు. దాంతో జంతు సంర‌క్ష‌ణ శాఖ నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్ ఆల‌స్యంగా ఇచ్చారు. త‌మిళ క్లియ‌రెన్స్ వ‌చ్చిన త‌ర్వాత తెలుగులో సెన్సార్ చేయించుకుందాం అనుకుంటే ఇక్క‌డ వ‌ర‌స‌గా హాలీడేస్ వ‌చ్చాయి. దాంతో శుక్ర‌వారం వ‌ర‌కు సెన్సార్ కావ‌డం క‌ష్టం. దాంతో శుక్ర‌వారం త‌ర్వాత విడుద‌ల చేసినా లాభం లేద‌ని.. సినిమాను అక్టోబ‌ర్ 26న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్. తెలుగులో ఈయ‌నే అదిరిందిని విడుద‌ల చేస్తున్నాడు. మొత్తానికి విజ‌య్ ఆశ‌ల్ని ఈ సినిమా కూడా నీరు గార్చేసింది. అయితే త‌మిళ‌నాట మాత్రం సినిమాకు మంచి టాక్ రావ‌డం విశేషం. ఇది ఇక్క‌డి ప్ర‌మోష‌న్ కు వాడుకుంటే సినిమాపై ఆస‌క్తి పెరిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

Follow US