విశాలే గెలిచాడు.. వెయ్ రా వీర‌తాడు..!

Last Updated on by

విశాల్ న‌మ్మ‌క‌మే గెలిచింది. తెలుగులో ఒక్క హిట్ కొట్టాల‌ని ఎప్ప‌ట్నుంచో చూస్తున్నాడు ఈ హీరో. వ‌ర‌స‌గా సినిమాలు వ‌స్తున్నాయి.. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌కు టాక్ కూడా బాగానే వ‌స్తుంది కానీ నిల‌బ‌డ‌టం లేదు. ఇప్పుడు అభిమ‌న్యుడు కూడా ఇదే వ‌ర‌స‌లోకి వెళ్తుందేమో అనుకున్నారు చాలా మంది. కానీ ఈ చిత్రం నిల‌బ‌డింది. డిజిట‌ల్ నేరాల‌పై తెర‌కెక్కిన ఈ చిత్రానికి టాక్ అద్భుతంగా వ‌చ్చింది. పైగా త‌ప్ప‌కుండా ప్ర‌తీ ఒక్క‌రు చూడాల్సిన సినిమా అంటూ మౌత్ టాక్ కూడా బాగానే వెళ్తుంది. దాంతో తొలిరోజే కోటికి పైగా షేర్ వ‌చ్చింది తెలుగు రాష్ట్రాల్లో. మొత్తం అంతా క‌లిపి కోటి 20 ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను తీసుకొచ్చాడు అభిమ‌న్యుడు.

రెండోరోజు థియేట‌ర్స్ ఇంకా పెంచేసారు. మ‌ల్టీప్లెక్సుల్లో కూడా ఆఫీస‌ర్, రాజుగాడు తీసేసి ఇదే సినిమా వేస్తున్నారు. ఈ మూడు రోజుల్లోనే క‌చ్చితంగా అభిమ‌న్యుడు 5 కోట్ల‌కు పైగా గ్రాస్ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే విశాల్ కు హిట్ వ‌చ్చిన‌ట్లే. ఎందుకంటే ఈ చిత్రాన్ని తెలుగులో సొంతంగానే విడుద‌ల చేసుకున్నాడు విశాల్. పైగా ఆఫీస‌ర్.. రాజుగాడు డిజాస్ట‌ర్స్ కావడంతో అభిమ‌న్యుడుకు క‌లెక్ష‌న్లు ఇంకా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. మ‌హాన‌టిని మాత్రమే ఇప్పుడు విశాల్ ఎదుర్కోవాల్సి ఉంది. అది తొలిస్థానంలో ఉన్నా రెండో స్థానంతో విశాల్ స‌రిపెట్టుకుంటున్నాడు. మొత్తానికి చాలా కాలం త‌ర్వాత సొంత నేల‌పై గెలుపు జెండా పాతాడు విశాల్.

User Comments