పార్ట్ టైమ్ కాదు.. ప్రొఫెష‌న‌ల్ సింగింగ్..

ఇదివ‌ర‌కు హీరోలు పాడుతున్నారంటే ఏదో స‌ర‌దా కోసం పాడుతున్నారులే అనుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్లు కూడా ప్రొఫెష‌న‌ల్స్ అయిపోతున్నారు. పార్ట్ టైమ్ సింగింగ్ కాస్తా ఇప్పుడు ప్రొఫెష‌న‌ల్ అయిపోయింది. త‌మ సినిమాలతో పాటు ప‌క్క హీరోల సినిమాల‌కు కూడా పాడేస్తున్నారు హీరోలు. శింబు, ఎన్టీఆర్ లాంటి వాళ్లే దీనికి ఉదాహ‌ర‌ణ‌.

క‌న్న‌డ‌లోనూ ఆ మ‌ధ్య ఓ పాట పాడాడు ఎన్టీఆర్. దానికి అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక ధ‌నుష్, శింబు లాంటి వాళ్లు కూడా ప్రొఫెష‌న‌ల్స్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో పాడ‌తారు. అప్పుడ‌ప్పుడూ పాడినా సిద్ధార్థ్ లోనూ మంచి గాయ‌కుడు ఉన్నాడు. వాళ్లందరికీ తోడు ఇప్పుడు తెలుగులో మ‌రో సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్ వ‌చ్చాడు అత‌డే అఖిల్. హ‌లో కోసం ఈయ‌న పాడిన ఏవేవో క‌ల‌లు క‌న్నా సాంగ్ ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ కూడా మ‌రోసారి త‌న గ‌ళం విప్పుతున్నాడు. అజ్ఞాతవాసిలో ఈయ‌న కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్ అంటూ ఫోక్ సాంగ్ పై ఫోక‌స్ పెట్టాడు. ఇదివ‌ర‌కు ప‌వ‌న్ పాడిన చాలా పాట‌లు ఛార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు అజ్ఞాత‌వాసి పాట కూడా ఇలాగే అవుతుంద‌ని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబ‌ర్ 31 సాయంత్రం 6 గంట‌ల‌కు ఇది విడుద‌ల కానుంది. హీరోయిన్ల‌లోనూ అద్భుత‌మైన సింగ‌ర్లు ఉన్నారు. ఇప్ప‌టికే కాజ‌ల్ తో పాడించాడు థ‌మ‌న్. ఇక నిత్యామీన‌న్, అనుప‌మ కూడా ప్రొఫెష‌న‌ల్స్ రేంజ్ లో పాడేస్తున్నారు. శృతిహాస‌న్ ఏకంగా మ్యూజిక్ ట్రూప్ సిద్ధం చేసుకుంటుంది. ఇలా ఇప్పుడు అంతా పార్ట్ టైమ్ పోయి.. ప్రొఫెష‌న‌లిజం వ‌చ్చేసింది పాట‌ల్లోకి.