మోహన్ రంగా బాగున్నాడు

Last Updated on by

నితిన్ కు ఇప్పుడు విజ‌యం త‌ప్ప‌నిస‌రిగా కావాలి. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఈయ‌న ఇప్పుడు కానీ  హిట్ కొట్ట‌క‌పోతే ఖచ్చితంగా రేస్ లో క‌నిపించ‌డు. ఓ వైపు కుర్ర హీరోలంతా కుమ్మేస్తున్నారు. మ‌నోడు మాత్రం ప‌డుతూ లేస్తూ ప‌య‌నం సాగిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఈయ‌న నుంచి వ‌స్తోన్న సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగా. త్రివిక్ర‌మ్ చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌రో ద‌ర్శ‌కుడికి క‌థ అందించాడు. చివ‌ర‌గా ఆయ‌న జై చిరంజీవ సినిమాకు క‌థ అందించాడు. ఇప్పుడు మ‌ళ్లీ నితిన్ కోసం పెన్ను మాత్ర‌మే ప‌ట్టాడు మాట‌ల మాంత్రికుడు. తాజాగా ఛ‌ల్ మోహ‌న్ రంగా ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఛ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌చ్చాడు. ఛ‌ల్ మోహ‌న్ రంగా ట్రైల‌ర్ పూర్తిగా కామెడీతోనే సాగిపోయింది. టీజ‌ర్ లో కాస్త ప్రేమ‌ను చూపించిన ద‌ర్శ‌కుడు.. ఈ సారి మాత్రం మొత్తం కామెడీతోనే వెళ్లిపోయాడు. కృష్ణ‌చైత‌న్య తొలి సినిమా రౌడీ ఫెల్లోకి పూర్తి భిన్నంగా ఉంది ఈ చిత్రం. ట్రైల‌ర్ తోనే సినిమాపై అంచ‌నాలు పెంచేసాడు ద‌ర్శ‌కుడు. నిజం చెప్పాలంటే ఇన్నాళ్లూ ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు ఇప్పుడు రెండింత‌లు కావ‌డం ఖాయం. ఎందుకంటే ట్రైల‌ర్ అంత ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది మ‌రి.

ఇందులో నితిన్ కూడా చాలా కొత్తగా ఉన్నాడు. ఇక మేఘాఆకాష్ మ‌రోసారి అందాలు ఆర‌బోసింది. లై జంట మ‌రోసారి ఇందులోనూ రొమాన్స్ అద‌ర‌గొట్టారు. కామెడీ.. ప్రేమ‌కు తోడు మాస్ కు కావాల్సిన అంశాల‌ను కూడా సినిమాలో పొందు ప‌ర్చాడు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల కానుంది.

User Comments