తాజా ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన ఛార్మి

Actress Charmi approach High Court Drugs Case
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకుముందు వరకు సిట్ విచారణకు తాను సహకరిస్తానని చెప్పుకొచ్చిన ఛార్మి.. తాజాగా ఉన్నట్టుండి హైకోర్టును ఆశ్రయించి ఆ సిట్ అధికారులకే పెద్ద షాక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే, డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఛార్మి ఈ నెల 26న అంటే బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీనికి ఛార్మి కూడా సానుకూలంగా స్పందించి తాను ఎటువంటి విచారణకు అయినా సిద్ధమేనని, సిట్ కార్యాలయానికి స్వయంగా వచ్చి మరీ విచారణను ఎదుర్కొంటానని స్పష్టం చేసింది.
కానీ, ఇప్పుడు ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ తాజాగా ఛార్మి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేస్తూ న్యాయస్థానం తలుపు తట్టడం షాకింగ్ గా మారింది. అంతేకాకుండా సిట్ దర్యాప్తు అభ్యంతరకరంగా ఉందంటూ ఛార్మి తన పిటిషన్ లో పేర్కొనడం.. తాను విచారణకు హాజరయ్యే సమయంలో అడ్వకేట్ ను వెంట తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే, ఈ పిటిషన్ ఈ మధ్యాహ్నమే విచారణకు రానుందని అంటున్నారు. మరి ఈ బుధవారమే సిట్ ఎదుట హాజరు కానున్న ఛార్మి.. ఈ తాజా పిటిషన్ తో ఏం సాధిస్తుందో చూడాలి. ఒకవేళ ఇప్పుడు ఈ హైకోర్టులో ఛార్మి పిటిషన్ కు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం సిట్ అధికారులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే, ఇలానే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న యంగ్ హీరో నవదీప్ తాజాగా సిట్ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యంగ్ హీరో పరిస్థితి ఏమవుతుందో చూడాలి.