అధికారులు ఇచ్చిన ఆప్షన్ కు నో చెప్పిన ఛార్మి 

Actress Charmi Rejects SIT Official Offer Enquiry

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొదట నోటీసులు అందుకోవడం, విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించడం బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ సెలబ్రిటీలను విచారిస్తున్న అధికారులు వాళ్ళ నుంచి కొత్త వివరాల్ని భారీగానే సేకరిస్తున్నట్లు తెలియడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఈ తాజా సమాచారంతో మరి కొంతమందికి నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతున్నారని, వాళ్లలో బడా బాబులు, వారి పిల్లలే ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళుతుందోనని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో మహిళల్ని విచారించని సిట్ అధికారులు.. ఇప్పుడు మొదటగా హీరోయిన్ ఛార్మిని విచారించడానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు విచారణలో మహిళలకు ఒక సదుపాయం ఇవ్వాలని అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సిట్ కార్యాలయానికి రావక్కర్లేదని, మీరు కోరుకున్న చోటే విచారించడానికి సిట్ సిద్ధంగా ఉందని ఛార్మికి సమాచారాన్ని అధికారులు చేరవేసినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు ఇచ్చిన ఈ ఆప్షన్ కు తాజాగా ఛార్మి నో చెప్పినట్లు తెలియడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మిగిలిన వారి మాదిరే తాను కూడా సిట్ కార్యాలయానికి వస్తానని, అందరిలానే తనను కూడా సిట్ కార్యాలయంలోనే విచారించాలని ఛార్మి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు విచారణాధికారులు ఇచ్చిన సదుపాయాన్ని ఛార్మి వద్దని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ రేంజ్ లో ఫైర్ తో విచారణకు రెడీ అవుతున్న ఛార్మి అక్కడకు వెళ్ళాక కథను ఎలా ముందుకు నడిపిస్తుందో చూడాలి.