కాజల్ అగర్వాల్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

సౌత్ లో బడా హీరోల సరసన నటిస్తూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టాలెంటెడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కు తాజాగా మద్రాసు హైకోర్టులో చుక్కెదురు కావడం గమనార్హం. ఈ మేరకు వీవీడీ కోకోనట్ ఆయిల్ తయారీ సంస్థపై కాజల్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేయడమే కాకుండా తిరిగి కాజల్ కే షాక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే, కాజల్ అగర్వాల్ 2008 లో వీవీడీ కోకోనట్ ఆయిల్ సంస్థ ప్రకటనలో నటించడానికి ఓ ఒప్పందం కుదుర్చుకుందట. దాంతో అప్పుడు ఆ బ్రాండ్ కోసం కాజల్ ఒక యాడ్ తో పాటు ఒక ఫోటో షూట్ కూడా చేసిందని సమాచారం. అయితే, ఆ తర్వాత కాజల్ ఉన్నట్టుండి, ఒక ఏడాది పాటే ప్రసారం చేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దానిని ఆ తర్వాత కూడా ప్రసారం చేశారని ఆరోపిస్తూ సదరు సంస్థపై 2011లో మద్రాసు హైకోర్టులో కేసు వేయడం విశేషం.
అంతేకాకుండా ఆ ప్రకటన ప్రసారాన్ని నిలిపి వేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేసినందుకు తనకు 2.50 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించేలా సదరు సంస్థను ఆదేశించాలని కాజల్ కోర్టును కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు తిరిగి తిరిగి ఈ కేసుకు సంబంధించి తుది విచారణ జరిగి తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు తాజాగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. కాపీరైట్స్ చట్ట ప్రకారం ఒక ప్రకటన దానిని రూపొందించిన సంస్థకే చెందుతుందని, అంతేగాని ఒక ఏడాదే దానిని ప్రసారం చేయాలనే హక్కు కాజల్ కు లేదని తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా ఒక వాణిజ్య ప్రకటన ప్రమోషన్ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ళ వరకూ ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. చివరగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆ సంస్థకు అయిన కోర్టు ఖర్చంతా కూడా కాజల్ అండ్ కో పెట్టుకోవాలని కోర్టు తీర్పు నివ్వడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.