హీరోయిన్ కు యాక్సిడెంట్.. సెల్ఫీలతో జనాలు

 

టెక్నాలజీ పుణ్యమా అని మనుషుల్లో మానవత్వం ఏ రేంజ్ లో మాయమైపోతుందో చెప్పడానికి తాజాగా ఓ ఉదాహరణ దొరికింది. ముఖ్యంగా సెల్ఫీల పిచ్చిలో జనాలు ఏ లెవెల్ కు దిగజారిపోతున్నారో తాజా ఘటన చెబుతోంది. ఇంతకూ మేటర్ ఏంటంటే, తాజాగా ఓ ప్రముఖ నటి ఊహించని విధంగా రోడ్ యాక్సిడెంట్ కు గురై చిన్నపాటి గాయాలతో బయటపడితే, ఆ టైమ్ లో అక్కడున్న జనాలు వ్యవహరించిన తీరు షాక్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా అక్కడకు చేరుకున్న వారంతా సదరు నటితో సెల్ఫీలు తీసుకున్న ఉదంతం అయితే పిచ్చెక్కిస్తోంది. ఇకపోతే, ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మెరిసిన హీరోయిన్ నేహా ధూఫియా. ఈ మేరకు తాజాగా చండీఘడ్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న ఆమె కారు ప్రమాదానికి గురైందట.

ఇక ఈ ప్రమాదంలో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు కానీ భుజం నొప్పి మాత్రం తీవ్రంగా బాధించిందట. ఇదే సమయంలో యాక్సిడెంట్ కారణంగా కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోవడం.. అనంతరం అక్కడున్నది హీరోయిన్ అని అందరికీ తెలిసిపోవడంతో.. అక్కడ నానా రభస జరిగిందట. ప్రధానంగా సాయం కోసం చూస్తున్న నేహా ధూఫియాను పట్టించుకోని జనాలు.. ఆమె పక్కకు వెళ్లి అనుమతి లేకుండానే ఒకరి తర్వాత ఒకరు సెల్ఫీలు తీసుకున్నారని సమాచారం. దీంతో నేహా ధూఫియా షాక్ కు గురైందని అంటున్నారు. ఓపక్క భుజం నొప్పితో బాధ పడుతుంటే, జనాలు సెల్ఫీల పిచ్చితో, అభిమానం పేరుతో వ్యవహరిస్తున్న తీరు చూసి కాసేపు దిగ్భ్రాంతికి గురైందట. చివరకు ఎలాగోలా వేరే కారులో ముంబైకు బయలుదేరిందని సమాచారం. ఇక ఆ తర్వాత కోలుకున్నాక జనాలు ఎలా తయారయ్యారో తలుచుకుని బాధపడిన నేహా ధూఫియా.. ఇదే సమయంలో తాను తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, సన్నిహితులు అందరికీ కృతఙ్ఞతలు చెప్పడం విశేషం.