తాప్సికి వాటా ఉంది కాబట్టే అలా చేసిందా..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసి మళ్ళీ టాలీవుడ్ కు చుట్టం చూపుగా వచ్చిన ఢిల్లీ భామ తాప్సి ప్రధాన పాత్రలో నటించిన ఆనందో బ్రహ్మ సినిమా ఈ శుక్రవారమే విడుదలైన విషయం తెలిసిందే. తాప్సితో పాటు శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ డిఫరెంట్ హర్రర్ కామెడీకి విడుదలకు ముందు నుంచే మంచి టాక్ ఉంది. ఇక విడుదలయ్యాక కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. మరిన్ని థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, కేవలం మూడు కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమా కోసం తాప్సి ఇప్పటివరకు ఎందుకంతగా ప్రచారం చేసిందనే వాదన ఇప్పుడు చర్చకు రావడం గమనార్హం. దాదాపు రెండు వారాల పాటు తాప్సి ప్రచారం నిర్వహించగా.. అన్ని పత్రికలకు, మ్యాగజైన్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ఇక్కడ బాగానే సందడి చేయడంతో తాప్సి ఎందుకు ప్రచారం చేసిందో అర్థం కావడం లేదని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చివరకు తాప్సి ఇంతగా ప్రచారం చేయడం వెనుక ఒక కారణం ఉందని ఓ కొత్త న్యూస్ ను తెరపైకి తీసుకొచ్చారు.

ఆ స్టోరీలోకి వెళితే, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ తప్ప మిగిలినిన ఏరియాలు యువీ క్రియేషన్స్, దిల్ రాజు సహాయంతో సినిమాను విడుదల చేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై మొదటి నుంచి తాప్సికి నమ్మకం ఉండటంతో.. హిట్ అయితే.. తనకు లాభాల్లో 20 శాతం వాటా ఇవ్వాలని నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో, సొట్ట బుగ్గల తాప్సి అందుకే అంతగా ప్రచారం నిర్వహించిందని, ఇప్పుడు అర్ధమయ్యిందని చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, టాలీవుడ్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా కూడా టాలీవుడ్ నుంచే వాటాలు పట్టికెళ్తున్న తాప్సిని మెచ్చుకుని తీరాల్సిందే.