మేజ‌ర్ కోసం శేష్ ప్రిప‌రేష‌న్స్

క్ష‌ణం, గూఢ‌చారి, ఎవరు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించారు అడివి శేష్‌. థ్రిల్ల‌ర్ బేస్డ్ కాన్సెప్టులు ఎంచుకుని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ర‌క్తి క‌ట్టించ‌డ‌మెలానో అత‌డు ప‌రిశ్ర‌మ‌కు పాఠం నేర్పిస్తున్నాడ‌న్న‌ది ప్ర‌ముఖులు చెబుతున్న మాట‌. శేష్ స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి అది అత‌డికి న‌టుడిగానూ పెద్ద ప్ల‌స్ అవుతోంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అత‌డి ఆల్ రౌండ‌ర్ నైపుణ్యానికి మంచి మార్కులు ప‌డుతున్నాయి.

ఇటీవ‌లే రిలీజైన `ఎవ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా త‌ర్వాత అత‌డు `మేజ‌ర్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. 26/11 ముంబై ఎటాక్స్ నేప‌థ్యంలో.. ఉగ్ర‌వాదుల‌ను ప్ర‌తిఘ‌టించిన‌ ఎన్.ఎస్.జీ క‌మెండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ విరోచిత పోరాట గాధ ఆధారంగా ఈ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ఆ పాత్ర కోసం శేష్ ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. మునుప‌టితో పోలిస్తే మ‌రింత ఫిట్ గా క‌నిపించేందుకు శేష్ క‌స‌ర‌త్తులు ప్రారంభించార‌ట‌. మూడు నెల‌ల్లోనే 10 కేజీల బ‌రువు త‌గ్గేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకోసం అత‌డు ఆహార నియ‌మాల్ని స్ట్రిక్టుగా పాటిస్తున్నాడ‌ట‌. వారానికి ఆరు గంట‌ల పాటు వ్యాయామం క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తున్నాడు. మేజ‌ర్ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మిస్తున్నారు. న‌మ్ర‌త ఈ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ్ తిక్క ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. శేష్ స్క్రిప్టును అందిస్తున్నారు.