అదిరింది రివ్యూ

రివ్యూ: అదిరింది

రేటింగ్:2.75/5

న‌టీన‌టులు: విజ‌య్, కాజ‌ల్, స‌మంత‌, నిత్యామీన‌న్, ఎస్ జే సూర్య త‌దిత‌రులు

క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: అట్లీకుమార్ 

నిర్మాత‌: తేండ్రాల్ మూవీస్, శ‌ర‌త్ మ‌రార్ (తెలుగు విడుద‌ల).. 

తెలుగులో తొలి విజ‌యం కోసం చకోర ప‌క్షిలా వేచి చూస్తున్నాడు విజ‌య్. త‌మిళ్ లో సూప‌ర్ స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం క‌నీస గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఈయ‌న తాజాగా అదిరింది అంటూ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రి టైటిల్ కు తగ్గ‌ట్లు నిజంగానే అద‌ర‌గొట్టాడా లేదంటే బెద‌ర‌గొట్టాడా చూద్దాం..!

క‌థ‌:
డాక్ట‌ర్ భార్గవ్ (విజ‌య్) కేవ‌లం ఐదు రూపాయ‌ల‌కే పేద‌ల‌కు వైద్యం అందిస్తుంటాడు. ఈయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించి విదేశాల్లోనూ ఈయ‌న‌కు స‌త్కారాలు జ‌రుగుతుంటాయి. ఇదే టైమ్ లో మెజీషియ‌న్ విజ‌య్ (విజ‌య్) కొంద‌రిని కిడ్నాప్ చేసి హ‌త్య‌లు చేస్తుంటాడు. విజ‌య్ చేసిన ప‌నుల‌కు భార్గవ్ పోలీసుల‌కు దొరికిపోతాడు. ఓ మ్యాజిక్ షోలో విజ‌య్ అంద‌రూ చూస్తుండ‌గానే మ‌రో డాక్ట‌ర్ ను మ్యాజిక్ పేరుతో హ‌త్య చేస్తాడు. అస‌లు విజ‌య్ ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడు..? పోలీసులు ఎందుకు డాక్ట‌ర్ భార్గవ్ ను అరెస్ట్ చేసారు..? అస‌లేంటి క‌థ‌..? మెడిక‌ల్ మాఫియా వ‌ల్ల భార్గవ్ విజ‌య్ ప‌డిన ఇబ్బందులేంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
స‌రిగ్గా 20 ఏళ్ల కింద తెలుగులో వెంక‌టేశ్ హీరోగా గ‌ణేష్ సినిమా వ‌చ్చింది.. అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదిరింది చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. దాంతో పాటు అప‌రిచితుడు లాంటి సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. మెడిక‌ల్ మాఫియా చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. మొద‌ట్లోనే ఎక్క‌డా టైమ్ వేస్ట్ చేయ‌కుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. కిడ్నాప్ ఎపిసోడ్.. హ‌త్య‌లు.. త‌ర్వాత పోలీసుల‌ ఎంట్రీ.. హీరోను అరెస్ట్ చేయ‌డం ఇవ‌న్నీ వేగంగా జ‌రిగి పోతాయి. డ్యూయ‌ల్ రోల్ అని రాసుకున్న‌పుడే వాటికి త‌గ్గ‌ట్లు స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ప్రేక్ష‌కుల్ని క‌న్ఫ్యూజ్ చేయ‌డానికి ఒక్క‌డే అంతా చేస్తున్న‌ట్లు చూపిస్తూ త‌న స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఫ‌స్టాఫ్ లో కాజ‌ల్ విజ‌య్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. అది త‌మిళ‌నాట ఓకే కానీ మ‌న ద‌గ్గ‌ర అంత‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌వేమో..! కానీ స‌మంత‌, విజ‌య్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ మాత్రం స‌ర‌దాగా అనిపిస్తాయి. అయితే మ‌రీ లెంత్ ఎక్కువ‌గా ఉండ‌టం కూడా అదిరింది అక్క‌డ‌క్క‌డ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది.
ఫ‌స్టాఫ్ లో తాను చెప్పాల‌నుకున్న సీన్స్ ప‌ర్ ఫెక్ట్ గా చెప్పినా.. విజ‌య్ మ్యాజిక్ షో.. కాజ‌ల్ సీన్స్.. మ‌ధ్య‌లో వ‌చ్చే కామెడీ సీన్స్ ఇవ‌న్నీ ఇక్క‌డ పెద్ద‌గా కిక్ అనిపించ‌వు. కానీ అదే టైమ్ లో మెడిక‌ల్ మాఫియా ఏ రేంజ్ లో ఉందో చెప్ప‌డానికి ఆటోవాలా అమ్మాయి యాక్సిడెంట్ కేస్ ను చాలా నిశితంగా.. మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు అట్లీ. సెకండాఫ్ లో మ‌రో విజ‌య్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం. అది చాలా బాగా రాసుకున్నాడు అట్లీ. ఎస్ జే సూర్య సీన్స్ అన్నీ చాలా ఇంటెన్స్ గా అనిపిస్తాయి. నిత్యామీన‌న్ పాత్ర‌తో హాస్పిట‌ల్ గురించి చెప్పించే డైలాగులు చాలా బాగుంటాయి. మ‌రీ ముఖ్యంగా దేవుడి గుడి కంటే హాస్పిటల్ ముఖ్యం.. అదే గుడితో స‌మానమ‌నే సీన్ బాగా డిజైన్ చేసుకున్నాడు. దానికి ముందు సీన్ అలా రాసుకున్నాడు. ఇక ఎస్ జే సూర్య ఎంట్రీ.. 80ల్లోనే డాక్ట‌ర్లు మెడిక‌ల్ బిజినెస్ ను ఎలా మాఫియాగా మార్చేసారు అనే సీన్స్ ఇవ‌న్నీ ఆలోచించేలా ఉంటాయి. సెకండాఫ్ లో త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు అది ఎంత‌వ‌ర‌కు న‌చ్చుతుందో చూడాలి..! తమిళ్ వెర్షన్ లో ఎలాంటి డైలాగ్స్ మ్యూట్ చేయలేదు కానీ తెలుగుకి వచ్చే సరికి కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేసారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే జిఎస్టీ డైలాగుల‌లో కొన్నింటిని మ్యూట్ చేసారు.

న‌టీన‌టులు:
విజ‌య్ మూడు పాత్ర‌ల్లో బాగా చేసాడు. ఈయ‌నే సినిమాను న‌డిపించాడు. ముఖ్యంగా తండ్రి పాత్ర‌ను చాలా బాగా చేసాడు విజ‌య్. ఈ పాత్ర కోసం గెట‌ప్ కూడా మార్చేసాడు విజ‌య్. స‌మంత‌, కాజ‌ల్ ఇలా వ‌చ్చి పాట‌ల్లో క‌నిపించి మాయ‌వ‌య్యే పాత్ర‌లే. నిత్యామీన‌న్ మాత్రం సెకండాఫ్ ను లీడ్ చేసింది. కొన్ని సీన్స్ లో విజ‌య్ ను కూడా డామినేట్ చేసింది. ఎస్ జే సూర్య విల‌నీ అద్భుతంగా ఉంది. డ‌బ్బు కోసం ఏదైనా చేసే డాక్ట‌ర్ గా బాగా న‌టించాడు. వ‌డివేలు చాలా కాలం త‌ర్వాత పెద్ద రోల్ చేసాడు. హీరోను స‌పోర్ట్ చేసే పాత్రే కానీ ఈయ‌న నుంచి కామెడీ పెద్ద‌గా ఊహించ‌డం క‌ష్ట‌మే. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అదిరిందికి వెన్నుముక‌. ప్ర‌తీ సీన్ లోనూ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా రేంజ్ ను పెంచేసాడు రెహ్మాన్. ముఖ్యంగా మాయో, నీతోనే పాటలు తెలుగులోనూ బాగున్నాయి. జికే విష్ణు సినిమాటోగ్ర‌ఫీ ప‌నితీరు అద్భుతంగా ఉంది. పాట‌ల‌ను అందంగా చూపించాడు. ఇక ఎడిటింగ్ ప‌ర్లేదు. త‌మిళ్ కు ఓకే కానీ ఇక్క‌డ ప్రేక్ష‌కుల కోసం మ‌రీ రెండు గంట‌ల 50 నిమిషాలు కాకుండా కాస్త నిడివి త‌గ్గిస్తే బాగుండేదేమో. అట్లీకుమార్ ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. యావ‌రేజ్ క‌థ‌నే టైట్ స్క్రీన్ ప్లేతో అల్లుకున్నాడు. అయితే మెడిక‌ల్ మాఫియా క‌థ అయినా గ‌ణేష్ ఛాయ‌లు ఎక్కువ‌గా ఉండ‌టం ఒక్క‌టే అదిరిందికి మైన‌స్ గా మారింది.

చివ‌ర‌గా: 
అదిరింది.. ఆలోచింప‌చేస్తుంది.. అక్క‌డ‌క్క‌డా విసిగిస్తుంది కూడా..!