మోక్ష‌జ్ఞ‌తో ఆదిత్య 999

Last Updated on by

యువ‌ర‌త్న‌ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా లెజెండ్ సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించిన `ఆదిత్య 369` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. టైమ్ మెషీన్ లో ఒక కాలం నుంచి ఇంకో కాలంలోకి ప్ర‌యాణించ‌డం అనే ఆస‌క్తిక‌ర‌ కాన్సెప్టుతో ఈ సినిమా తెర‌కెక్కింది. చాలా కాలం త‌ర‌వాత ఇదే త‌ర‌హా క‌థాంశంతో సూర్య హీరోగా విక్ర‌మ్‌.కె.కుమార్ 24 అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. అంత‌కు ముందే హాలీవుడ్‌లో ఈ త‌ర‌హా సినిమా క‌థాంశంతో `బ్యాక్ టు ద ఫ్యూచ‌ర్‌` అనే సినిమా సంచ‌ల‌నాలు సృష్టించిన‌ సంగ‌తి తెలిసిందే.

ఈ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితోనే అప్ప‌ట్లో సింగీతం శ్రీ‌నివాస‌రావు `ఆదిత్య 369` సినిమా తెర‌కెక్కించారు. అప్ప‌ట్లోనే అడ్వాన్స్‌డ్ విజ‌న్‌తో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని బాల‌కృష్ణ‌ ప్ర‌య‌త్నించారు. కానీ ఎందుక‌నో అది ఇప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌లేదు. ఇదే ప్ర‌శ్న `ఆదిత్య 369` నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ని అడిగితే.. దీని కోసం రెండు మూడుసార్లు ప్ర‌య‌త్నాలు సాగాయి. న‌న్ను చేయ‌మ‌ని అడిగినా కుద‌ర‌ద‌ని చెప్పేశాను. ఆ త‌ర‌వాత వేరే నిర్మాత‌లు అందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఎందుక‌నో ఏదీ సెట్ట‌వ్వ‌లేదు.. అని తెలిపారు. మీరే సీక్వెల్ చేయొచ్చు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. ఒక గొప్ప సినిమాకి సీక్వెల్ అంటే సాహ‌స‌మే.. అందుకే చేయ‌లేను.. అని అన్నారు. మోక్ష‌జ్ఞ హీరోగా సీక్వెల్ సినిమా ఆదిత్య 999 చేస్తే బావుంటుంది క‌దా! అన్న ప్ర‌శ్న‌కు .. సింగీతం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడితో అలాంటి ప్ర‌యోగం చేస్తే బాగానే ఉంటుంది. అయితే కథ రెడీ కావాలి క‌దా! .. అని అన్నారు. ఆలోచ‌న బాగానే ఉంది కానీ.. అని సందేహించారు. మొత్తానికి ఒక ఆలోచ‌న అయితే ఉంది.. కానీ అందుకు చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని స‌న్నివేశం చెబుతోంది. సుధీర్‌బాబు- అదితీరావ్ హైద‌రీ జంట‌గా ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శివ‌లెంక నిర్మించిన `స‌మ్మోహ‌నం` ఈనెల 7న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments