ప్ర‌భాస్ హీరోగా రంగ‌స్థ‌లం 2..!

Last Updated on by

అదేంటి.. రంగ‌స్థ‌లం 2 లో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌డం ఏంటి..? అయినా సుకుమార్ నెక్ట్స్ సినిమా మ‌హేష్ బాబుతో చేస్తున్నాడు క‌దా..! ఒక‌వేళ ఈ సినిమా సీక్వెల్ చేయాల్సి వ‌స్తే చ‌ర‌ణ్ ఉండ‌గా ప్ర‌భాస్ తో ఎందుకు చేస్తాడు అనుకుంటున్నారా..? అయితే మీ ఊహ‌ల‌కు అక్క‌డితో బ్రేకులేయండి. ప్ర‌భాస్ రంగ‌స్థ‌లం 2లో న‌టించ‌డం లేదు.. కానీ అలాంటి సినిమా చేస్తున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఇప్పుడు దుబాయ్ లో సాహో యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్.. జూన్ నుంచి రాధా సినిమాతో జాయిన్ కానున్నాడు. అప్ప‌ట్నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కానుంది. దీనికోసం సాహోకు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం కూడా 120 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నుంది. పైగా ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు. పీరియాడిక‌ల్ ప్రేమ‌క‌థ‌గా దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు రాధాకృష్ణ‌.

ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యాన‌ర్ లో బిల్లా త‌ర్వాత మ‌రోసారి ప్ర‌భాస్ తో సినిమా నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు కృష్ణంరాజు. ఆయ‌న‌తో పాటే యువీ క్రియేష‌న్స్ భాగ‌స్వామ్యంగా ఉండ‌బోతుంది. జిల్ ఫ్లాప్ అయినా కూడా ఆయ‌న టేకింగ్ న‌చ్చి రాధాకృష్ణ కుమార్ కు ఛాన్సిచ్చాడు ప్ర‌భాస్. ఈ కుర్ర ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి సినిమాకు సిద్ధం అయ్యాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఈ సినిమా పూర్తిగా 70-80వ ద‌శ‌కంలో జ‌రిగే క‌థ అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఇలాంటి పీరియాడిక‌ల్ క‌థ ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మొన్నొచ్చిన రంగ‌స్థ‌లం రికార్డుల ర‌చ్చ ఇంకా ఆగ‌నే లేదు. ఇక మ‌హాన‌టి.. శ‌ర్వానంద్-సుధీర్ వ‌ర్మ సినిమా కూడా 80ల నేప‌థ్యంలోనే వ‌స్తున్నాయి. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా సైతం రంగ‌స్థ‌లం బాట‌లోనే ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రంగ‌స్థ‌లం జిగేల్ రాణి పూజాహెగ్డే న‌టించ‌బోతుంది. మ‌రి.. రంగ‌స్థ‌లం కాని రంగ‌స్థ‌లం 2లో ప్ర‌భాస్ ఎలా ఉండ‌బోతున్నాడో.. ఎంత వ‌ర‌కు మాయ చేస్తాడో..? ఈ సినిమా 2019లో విడుద‌ల కానుంది.

User Comments