సంక్రాంతి సినిమాల జాత‌కం ఇదే..!

Last Updated on by

చూస్తుండ‌గానే సంక్రాంతి అయిపోయి 20 రోజులు అయిపోయింది. ఆ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అయితే గ‌త రెండు మూడు సంక్రాంతులతో పోలిస్తే ఈ సారి మాత్రం కాంతులు లేని సంక్రాంతి వ‌చ్చింది. 2018 సంక్రాంతి చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆశ పెట్టుకున్న అజ్ఞాత‌వాసి అడ్ర‌స్ లేకుండా పోయింది.. ఈ చిత్రం ఏకంగా 65 కోట్ల న‌ష్టాలు మిగిల్చి టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అంచ‌నాల్లేని జై సింహా ఓకే అనిపించింది. 2016లో సోగ్గాడే చిన్నినాయ‌నా.. నాన్న‌కు ప్రేమ‌తో.. ఎక్స్ ప్రెస్ రాజా.. డిక్టేట‌ర్ వ‌స్తే అందులో ఒక్క డిక్టేట‌ర్ మాత్ర‌మే ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక 2017లో ఖైదీ నెం.150.. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. శ‌త‌మానం భ‌వ‌తి మూడు దుమ్ము దులిపేసాయి. కానీ 2018లో మాత్రం ఇలా చెప్పుకోడానికి ఏం మిగ‌ల్లేదు.

అంద‌రికంటే ముందు వ‌చ్చి.. ముందే రేస్ నుంచి త‌ప్పుకున్నాడు ప‌వ‌న్. అజ్ఞాత‌వాసి తొలిరోజు 40 కోట్లు వ‌సూలు చేసినా.. త‌ర్వాత లైఫ్ టైమ్ వ‌సూళ్ళు మ‌రో 20 కోట్లు మాత్ర‌మే సాధించాడు. ఫుల్ ర‌న్ లో ఈ చిత్రం 61 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. సాధార‌ణంగా అయితే ఇది చాలా మంచి వ‌సూళ్లు. కానీ ప‌వ‌న్ ఇమేజ్ కు మాత్రం కాదు. ఈ చిత్రం 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. వ‌చ్చింది మాత్రం 61 కోట్లే. ఇదే పండ‌క్కి సైలెంట్ గా వ‌చ్చిన జై సింహా ఫుల్ ర‌న్ లో 28 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది కానీ ప‌వ‌న్ సినిమాతో పోల్చ‌డం జై సింహాకు క‌లిసొచ్చింది. సూర్య గ్యాంగ్ కూడా గుడ్డిలో మెల్ల అన్న‌ట్లు 7 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇక సైలెంట్ గా వ‌చ్చిన రాజ్ త‌రుణ్ రంగుల‌రాట్నం రంగుల్లో క‌లిసిపోయింది. మొత్తానికి సంక్రాంతి సినిమాల్లో ఏదీ సూప‌ర్ హిట్ కాలేదు. ఓకే అని చెప్పుకోడానికి మాత్రం బాల‌య్య జైసింహా మిగిలింది.

User Comments