ఒక‌టి తేలింది.. మూడు మిగిలాయి..

సంక్రాంతి రేస్ మొద‌లైంది. అజ్ఞాత‌వాసి విడుద‌లైపోయింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 9 రాత్రి నుంచే నాన్ స్టాప్ గా షోలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే క్లియ‌ర్ టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. సినిమా క‌చ్చితంగా అంచ‌నాలు అందుకోలేదు. ఇందులో దాచి పెట్ట‌డానికి అయితే ఏమీ లేదు. ప‌వ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్ కూడా ఫ‌స్ట్ టైమ్ పూర్తిస్థాయిలో నిరాశ ప‌రిచాడు. తానేం తీస్తున్నాడో కూడా తెలియ‌నంత‌గా అజ్ఞాత‌వాసి తీసాడు మాట‌ల మాంత్రికుడు. ఇక ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో మిగిలిన సినిమాలు మూడు. అందులో జ‌న‌వ‌రి 12న బాల‌య్య జై సింహా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పుడు అంద‌రి క‌ళ్లు ప‌డ్డాయి.

చ‌డీ చ‌ప్పుడు లేకుండా వ‌చ్చి బాల‌య్యే పండ‌గ విజేత‌గా నిలుస్తాడేమో అనుకుంటున్నారంతా ఇప్పుడు. జై సింహాలో ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కింది. కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రంతో పాటు జ‌న‌వ‌రి 12నే రానున్న మ‌రో సినిమా గ్యాంగ్. డ‌బ్బింగ్ సినిమానే అయినా దాన్ని త‌క్కువంచ‌నా వేయ‌డానికి లేదు. సూర్య న‌టించిన సినిమా కావ‌డంతో ఇక్క‌డ కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా కామెడీ డోస్ ఇందులో ఎక్కువ‌గా ఉంది. ఇక లాస్ట్ బ‌ట్ నాట్ ది లీస్ట్.. రంగుల‌రాట్నం. ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుదలవుతుంది. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించాడు. శ్రీ‌రంజని అనే కొత్త‌మ్మాయి తెర‌కెక్కించింది. అజ్ఞాత‌వాసి ఎలాగూ ప‌స‌లేద‌ని తేలిపోవ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపులు ఈ మూడు సినిమాల‌పైకి వెళ్లాయి.