బయ్యర్లు ఏ బావిలో దూకాలిప్పుడు..?

మంచోడే మంచోడే అంటే మొత్తం ముంచేసి వెళ్ళాడంట‌.ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. ఈయ‌న్ని చూసి బాధ ప‌డాలో.. ఏడ‌వాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు బ‌య్య‌ర్లు. ప‌వ‌ర్ స్టార్ అనే బిరుదు.. ఆయ‌న క్రేజ్.. సిక్స్ ఫీట్ క‌టౌట్ చూసి సినిమాల‌ను ఎంత రేట్ ప‌డితే అంత పెట్టి కొనేస్తున్నారు. కానీ అవి మాత్రం అంచనాలు అందుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. గ‌త కొన్నేళ్లుగా ఇదే జ‌రుగుతుంది. కానీ బ‌య్య‌ర్లు మాత్రం మార‌డం లేదు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈయ‌న న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమాకు టాక్ చాలా తేడాగా ఉంది. ఈ చిత్రం ఊహ‌కంద‌ని న‌ష్టం తీసుకొస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ఇక్క‌డ నైజాం.. అక్క‌డ ఓవ‌ర్సీస్ లో అజ్ఞాత‌వాసి న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

నా సినిమాలు న‌చ్చితేనే చూడండి.. లేదంటే వ‌ద్దు అని పొలైట్ గా చెప్పే ప‌వ‌న్.. త‌న సినిమాల‌ను కొని రోడ్డున బ‌డ్డ బ‌య్య‌ర్ల‌కు ఏం స‌మాధానం చెప్తాడో అని ఆస‌క్తిగా చూస్తున్నారంతా. ఇప్పుడు అజ్ఞాతవాసికి కూడా ఫ్లాప్ టాక్ వ‌చ్చేసింది. త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ కూడా ఈ చిత్రాన్ని కాపాడ‌లేక‌పోయాడు. అస‌లేం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియ‌నంత దారుణంగా ఉంది ఈ చిత్రం. దాంతో బ‌య్య‌ర్లు ఇప్ప‌ట్నుంచే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 120 కోట్ల‌కు ఈ చిత్రాన్ని కొన్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఆ విష‌యం త‌లుచుకుంటేనే వాళ్ల గుండెలు జారిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో సినిమా ఎంత వ‌సూలు చేస్తుంద‌నేది కూడా లెక్క‌లు క‌ట్ట‌లేక‌పోతున్నారు.

తొలి రోజు అయితే రికార్డు స్థాయిలో 60 కోట్ల గ్రాస్.. 40 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. టాక్ బ‌య‌టికి వెళ్లిపోవ‌డం.. పైర‌సీ రావ‌డంతో ఇప్ప‌టికే చాలా చోట్ల క‌లెక్ష‌న్లు డ్రాప్ అయ్యాయి. ఇక నుంచి నైజాంలో ఈ న‌ష్టం మ‌రింత ఉంటుంద‌ని తెలుస్తుంది. ఎందుకంటే పండ‌క్కి ఆంధ్రా వాళ్లంతా సొంతూళ్ల‌కు వెళ్లిపోతున్నారు. దాంతో తెలంగాణ‌లో క‌లెక్ష‌న్లు ప‌డి పోవ‌డం ఖాయం. ఇవ‌న్నీ త‌లుచుకుంటుంటేనే బ‌య్య‌ర్ల‌కు నిద్ర ప‌ట్ట‌ట్లేదు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ను న‌మ్మి రెండు సార్లు అడ్డంగా మునిగిపోయారు బ‌య్య‌ర్లు. గ‌తేడాది కాట‌మ‌రాయుడు 25 కోట్ల వ‌ర‌కు ముంచితే.. దానికి ముందే స‌ర్దార్ తో 30 కోట్లు ముంచాడు ప‌వ‌ర్ స్టార్. వీళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేయ‌లేదు ఈ హీరో. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మ‌రోసారి అజ్ఞాత‌వాసితో ముంచేసేలా క‌నిపిస్తున్నాడు. మ‌రి ఈ బ‌య్య‌ర్ల గోడుకు ప‌వ‌న్ ఏం స‌మాధానం చెప్తాడో..?

 

Follow US