జ‌క్క‌న్న ఆయ‌న్ని భగ‌త్‌సింగ్‌ని చేశాడా?

రాజ‌మౌళి సినిమాలో ప్ర‌తి పాత్ర‌కీ ప్రాధాన్యం ఉంటుంది. ఇక నిజంగా క‌థ‌లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌యితే గ‌నక దాన్ని మ‌రో రేంజ్‌లో చూపిస్తుంటాడు జ‌క్క‌న్న‌. విల‌న్ పాత్ర అయితే ఇక దాన్ని హీరోకి రెండింత‌ల బిల్డ‌ప్‌తో చూపిస్తుంటాడు. దానివ‌ల్ల హీరో పాత్ర కూడా మరింత ఎలివేట్ అవుతుంటుంది. తాజాగా ఆయ‌న తెరకెక్కిస్తున్న `ఆర్‌.ఆర్‌.ఆర్`లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు ఎన్నో ఉన్నాయ‌ట‌. అందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ పోషిస్తున్న పాత్ర ఒక‌టి. ఆయ‌న నిన్న‌నే ఆర్‌.ఆర్‌.ఆర్ సెట్లోకి అడుగుపెట్టాడు. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొని ఎక్సైట్ అయ్యాడు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపిస్తాడు. ఎన్టీఆరేమో కొమ‌రం భీమ్‌గా క‌నిపిస్తాడు. మ‌రి అజ‌య్ దేవగ‌ణ్ పాత్ర ఎవ‌రిలా ఉంటుంద‌నేదే ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.

హీరోలిద్ద‌రికీ మార్గ‌నిర్దేశ‌కుడిగా కనిపిస్తాడ‌ని కొంద‌రంటే, విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని మ‌రికొంద‌రు మాట్లాడుకున్నారు. కానీ అస‌లు విష‌యం వేరే ఉంద‌ట‌. త్యాగానికీ, సాహ‌సానికీ మారుపేరైన స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ పాత్రలో అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అలాంటి పాత్ర‌లో,అజ‌య్ దేవ‌గ‌ణ్‌లాంటి ప‌వ‌ర్‌ఫుల్ క‌థానాయ‌కుడు క‌నిపిస్తే ఇక అది ఏ రేంజ్‌లో పండుతుంద‌నేది, తెర‌పై ఆ పాత్ర ఎలా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాలా? ఈ సినిమా ఈ యేడాది దస‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.