అఖిల్.. కాస్త నేల‌మీద‌కు కూడా రావ‌య్యా..!

అఖిల్ ను చూస్తుంటే ఇప్పుడిదే అనాల‌నిపిస్తుంది. ఈయ‌న రెండో సినిమా ఎలా ఉండ‌బోతుందో అస్స‌లు ఊహ‌కు కూడా అంద‌డం లేదు. క‌చ్చితంగా విక్ర‌మ్ కే కుమార్ తో ఈయ‌న చేస్తోన్న హ‌లో సినిమా అయితే రెగ్యుల‌ర్ యాక్ష‌న్ సినిమా అయితే కాదు. అక్ష‌రాలా 42 కోట్ల‌తో నాగార్జున హ‌లోను నిర్మిస్తున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రం త‌న కుమారుడికి రీ లాంఛ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు నాగార్జున‌. ఇదిలా ఉంటే హ‌లో సినిమాపై అఖిల్ మాత్రం బాగా న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఈ చిత్ర అప్ డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడు. మ‌రోవైపు అఖిల్ కూడా త‌న సినిమా గురించి చెప్తూనే ఉన్నాడు.

హ‌లో షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర  చివరి షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ చిత్ర పోస్ట‌ర్స్ విడుద‌ల‌వుతున్న కొద్దీ చిత్రంపై ఆస‌క్తి పెరిగిపోతుంది. తొలి పోస్ట‌ర్ లోనేమో త‌ల‌కిందులుగా గాల్లో తేలిపోతూ క‌నిపించాడు.. రెండో పోస్ట‌ర్ లో గోడ‌పై న‌డుస్తున్నాడు.. మూడో పోస్ట‌ర్లో బైక్ రైడింగ్ చేస్తున్నాడు.. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ పోస్ట‌ర్ లోనూ నేల‌పైకి రాలేదు అఖిల్. ఇక్క‌డ కూడా ధూమ్ లో హృతిక్ లా గాల్లోనే ఉన్నాడు. న‌వంబ‌ర్ 16న ఈ చిత్ర టీజ‌ర్ విడుదల కానుంది. డిసెంబర్ 22న హలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర ప‌డటంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉందంటూ ట్వీట్ వేసాడు అఖిల్. అంతేకాదు ప్ర‌మోష‌న్ కూడా మొద‌లుపెట్టాడు అఖిల్. ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రం అఖిల్ కెరీర్ కు కీల‌కం. ఇది కానీ తేడా కొడితే సిసింద్రీ కెరీర్ పైనే ఎఫెక్ట్ ప‌డే ప్ర‌మాదం లేక‌పోలేదు.