ఉగాదికి అక్కినేని హీరోల జాతకం

Last Updated on by

సాధారణంగా ఉగాదిని తెలుగు కొత్త సంవ‌త్స‌రం అంటాం. ఆ రోజు అంతా జాత‌కాలు చెప్పించుకుంటారు. కొత్త ఏడాది వ‌చ్చింద‌ని సంబ‌రాలు చేసుకుంటారు. ఈ సారి కూడా ఉగాది వ‌చ్చేస్తుంది. మ‌రో మూడు రోజుల్లోనే పండ‌గ వాతావ‌ర‌ణం రానుంది. ఇక ఈ ఏడాది ఉగాది అక్కినేని కుటుంబానికి మ‌రీ ప్ర‌త్యేకంగా మారనుంది. ఒకేరోజు మూడు సినిమాలతో పండ‌గ చేయించనున్నారు అభిమానుల‌తో అక్కినేని హీరోలు. ఓవైపు తండ్రి.. మ‌రోవైపు త‌న‌యులు అంతా ఒకేరోజు త‌మ సినిమాల ముచ్చ‌ట్లు చెప్ప‌బోతున్నారు. ముందుగా నాగార్జున మార్చ్ 18న ఉగాది కానుక‌గా త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. అది కూడా హిట్ మిష‌న్ నానితో. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఉగాది రోజే మొద‌లు కానుంది. ఇక అదేరోజు వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ఆఫీస‌ర్ టీజ‌ర్ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఓ వైపు తండ్రి సినిమా ప‌ట్టాలెక్కుతుంటే త‌న‌యులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు…? ఎప్ప‌ట్నుంచో పెండింగ్ లో పెట్టిన త‌న మూడో సినిమా ముచ్చ‌ట‌ను ఉగాది రోజే బ‌య‌ట పెట్ట‌బోతున్నాడు అఖిల్. వెంకీ అట్లూరితో ఈయ‌న మూడో సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే క‌థ కూడా ఫైన‌ల్ అయింది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తొలిప్రేమ‌తో మంచి విజ‌యం అందుకున్న వెంకీ అట్లూరి.. అఖిల్ తోనూ ప్రేమ‌క‌థ‌నే తెరకెక్కించ‌బోతున్నాడు. హ‌లోతో ఈ మ‌ధ్యే మంచి ప్రేమ‌క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు రుచి చూపించాడు అఖిల్. కానీ కోరుకున్న హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు.

ఇక నాగ‌చైత‌న్య కూడా ఈ ఉగాదినే టార్గెట్ చేస్తున్నాడు. ఆ రోజే ఈయ‌న న‌టిస్తోన్న స‌వ్య‌సాచి సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో చైతూ కొత్త పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులోనే కాదు.. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఇలాంటి క‌థ రాలేదంటున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. ఇందులో హీరో ఎడ‌మ‌చేతికి బాడీతో క‌నెక్ష‌న్ ఉండ‌దు. దాంతో అత‌డికి ఎదురయ్యే స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయి అనేది క‌థ‌. ఈ మూడు సినిమాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్.. అనౌన్స్ మెంట్స్.. టీజ‌ర్స్ అన్నీ ఒకేరోజు రానుండ‌టంతో అక్కినేని అభిమానులు ఉగాది కోసం వేయిక‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. మే 25న ఆఫీస‌ర్.. జూన్ 14న స‌వ్యసాచి విడుద‌ల కానున్నాయి.

User Comments