ప్యాడ్ మ్యాన్ కు పైస‌ల్లేవు

Last Updated on by

కొన్ని సినిమాలంతే.. ప్ర‌శంస‌ల వ‌ర‌కు వ‌చ్చి పైస‌లు మాత్రం తీసుకురాలేవు. ప్యాడ్ మ్యాన్ కూడా ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరిపోయింది. రిలీజ్ కి ముందు ఊహించిన‌న్ని క‌లెక్ష‌న్లు ఈ సినిమాకు రావ‌డం లేదిప్పుడు. బాల్కీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ న‌టించాడు. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. తొలిరోజు 10 కోట్ల‌తోనే స‌రిపెట్టుకుంది. ఆ త‌ర్వాత రెండు రోజుల్లో 28 కోట్లు తీసుకొచ్చింది. కానీ నాలుగో రోజు నుంచే ప్యాడ్ మ్యాన్ వ‌సూళ్లు ప‌డిపోతూవ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 6 రోజుల్లో 60 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓ మామూలు హీరో సినిమాకు అయితే ఓకే కానీ.. రెండేళ్లుగా ప‌రాజ‌యం అంటూ లేని అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాకు మాత్రం ఇది చాలా త‌క్కువ వ‌సూళ్లు.

ప్యాడ్ మ్యాన్ కు వ‌సూళ్లు ఊహించినంత రాక‌పోవ‌డానికి కార‌ణాలు కూడా లేక‌పోలేవు. ఈ చిత్రం ఆడ‌వాళ్ల ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్.. అంటే పీరియ‌డ్స్ ఆధారంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు బాల్కీ. అమీర్ ఖాన్ నుంచి ఆయుష్మాన్ ఖురానా వ‌ర‌కు.. దీపిక నుంచి హ్యూమా ఖురేషీ వ‌ర‌కు అంతా ఈ సినిమా కోసం ప్యాడ్స్ ప‌ట్టుకుని ప్ర‌మోట్ చేసారు. ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా.. సినిమాకు ఎంత మంచి టాక్ వ‌చ్చినా కూడా మ‌న ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మాత్రం ఇంకా అంత‌గా ఎద‌గ‌లేదు. ప‌క్క‌న అమ్మాయిల‌ను కూర్చోబెట్టుకుని ఇలాంటి సినిమాలు చూసే స్థాయికి మ‌న దేశం రాలేదింకా. అందుకే ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ను ప్రేక్ష‌కులు ఒప్పుకోలేకపోతున్నారు. ఓవ‌ర్సీస్ లో కూడా ప్యాడ్ మ్యాన్ కు ఊహించిన రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. మొత్తానికి ప్ర‌శంస‌ల ప‌రంగా ప్యాడ్ మ్యాన్ తోపు అయినా కూడా పైస‌ల ద‌గ్గ‌ర మాత్రం వెన‌క‌బ‌డ్డాడు.

User Comments