రివ్యూ: అల… వైకుంఠ‌పుర‌ములో

ala vaikunthapurramuloo review

నటీనటులు: అల్లు అర్జున్, మురళీ శర్మ, సుషాంత్, పూజా హెగ్డే

తదితరులుదర్శకత్వం: త్రివిక్ర‌మ్‌

సంగీతం : త‌మ‌న్ 

ముందు మాట‌:
అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్‌ – ఈ క‌ల‌యికపైన ఉండే అంచ‌నాలే వేరు. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`లాంటి విజ‌యాలు వీళ్ల ఖాతాలో ఉన్నాయి. వాటి త‌ర్వాత క‌లిసి సినిమా చేయ‌డం ఒకెత్తైతే, ఆ సినిమా సంక్రాంతికొస్తుండ‌డం మరో ఎత్తు. అందుకే `అల‌… వైకుంఠపుర‌ములో` చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కుటుంబ క‌థ‌తోనే ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని ప్ర‌చార చిత్రాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. కుటుంబ‌మంతా క‌లిసి చేసుకుంటున్న పండ‌గ‌కి, ఓ ఫ‌క్తు కుటుంబ క‌థా చిత్రం వ‌స్తే ప్రేక్ష‌కుల‌కు అంత‌కంటే కావ‌ల్సింది ఏముంటుంది? మ‌రి సినిమా ఎలా ఉంది?
@ క‌థ‌
బంటు (అల్లు అర్జున్‌) ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు. పూజా హెగ్డే బాస్‌గా ఉన్న కంపెనీలో ఉద్యోగిగా చేర‌తాడు. బంటు మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడే అయినా ఆయ‌న‌కి వైకుంఠ‌పుర‌ము అనే ఓ పెద్దింటితో సంబంధం ఉంటుంది. ఆ పెద్దింటి య‌జ‌మాని ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటాడు. అదే స‌మ‌యంలో బంటుకి పెద్దింటితో ఉన్న సంబంధం ఏమిటో, త‌న పుట్టుక వెన‌క ఉన్న ర‌హ‌స్య‌మేమిటో తెలుసుకుంటాడు. ఆ స‌మ‌యంలో అత‌ను వైకుంఠ‌పురంలోకి వెళ్లాల్సి వ‌స్తుంది. మ‌రి అక్క‌డికి వెళ్లి ఏం చేశాడు? ఆ ఇంట్లో ఉన్న‌వాళ్ల మ‌న‌సుల్ని ఎలా గెలిచాడు? వాళ్ల స‌మ‌స్య‌ల్ని ఎలా తీర్చాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

@ విశ్లేష‌ణ‌
త్రివిక్ర‌మ్ బ‌లం హ్యూమ‌ర్‌, ఎమోష‌న్స్‌. ఆ రెండింటినీ అస్త్రాలుగా చేసుకునే ఈసారి కూడా రంగంలోకి దిగాడు. క‌థ ప‌రంగా ఆయ‌న కొత్త‌గా ప్ర‌య‌త్నించిందేమీ లేదు. ఇదివ‌ర‌కు ఆయ‌న చేసిన సినిమాల క‌థ‌ల్నే గుర్తుచేస్తుందీ సినిమా. త‌న శైలి మాట‌ల‌తో హ్యూమ‌ర్ పండిస్తూ సినిమాని ముందుకు న‌డిపించారు. అయితే ఆ వినోదం కూడా ఇందులో మ‌రీ క్లాసీగా, మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుల‌కు మాత్రమే అన్న‌ట్టుగా ఉంటుంది. విరామ స‌మ‌యంలో మంచి భావోద్వేగాలతో ద్వితీయార్థంపై ఆస‌క్తి పెంచాడు. తండ్రీ కొడుకుల బంధం, భావోద్వేగాల‌తో మిగ‌తా సినిమాని న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. రెండో స‌గ‌భాగంలో సినిమా గ్రాఫ్ త‌గ్గిన‌ట్టు అనిపించినా… డైలాగ్స్‌తోనే సినిమాని నిలిపే ప్ర‌య‌త్నం చేశాడు. అల్లు అర్జున్ ఆయ‌న‌కి మరింత అండ‌గా నిలిచాడు. తన కూల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో స‌న్నివేశాల్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక పాట‌ల ప‌రంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న మార్క్ స్టెప్స్‌తో అద‌ర‌గొట్టాడు బ‌న్నీ. పూజా హెగ్డే, నివేదా పెతురాజ్ స్కిన్ షో చేయ‌డం తప్ప పెద్దగా న‌టించే ఆస్కారం దొర‌క‌లేదు. సీనియ‌ర్ నటీమణులకు బలమైన పాత్రలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన త్రివిక్రమ్ ఈసారి టబుకు ఆ స్థాయి పాత్రని ఇవ్వ‌లేక‌పోయాడు. మురళి శర్మ మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో ఒదిగిపోయాడు. సుశాంత్ సినిమా మొత్తం క‌నిపించినా, ఆయ‌న‌కి సరైన సంభాషణలు కానీ, ఆయన పాత్రలో బ‌లం కానీ లేదు. దాంతో సినిమాపై పెద్ద‌గా ప్ర‌భావం చూపించలేక‌పోయాడు. సునీల్ కూడా అంతే. జయరామ్, స‌ముద్ర‌ఖ‌ని పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. త‌మ‌న్ సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎసెట్‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. త్రివిక్రమ్ బ్రాండ్ సినిమాను ఆస్వాదించే మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఈ చిత్రం గొప్ప అనుభూతినిస్తుంది. బీసీ సెంట‌ర్ ప్రేక్ష‌కుల‌కి సున్నిత‌మైన ఈ క‌థ‌, హాస్యం సూక్ష్మమైన హాస్యం ఎంత‌వ‌ర‌కు మింగుడుప‌డుతుందో మ‌రి. పండ‌గ సీజ‌న్ ఈ సినిమాకి క‌లిసొచ్చే మ‌రో అంశం.

@ చివ‌రిగా… నాన్నారింటికి దారేది అంటున్న బ‌న్నీ

రేటింగ్: 3.0/5