అల్ల‌రి న‌రేష్ రూటు మార్చేశాడా?

తొలి సినిమా నుంచే అల్ల‌రి చేస్తూ కిత‌కిత‌లు పంచేశాడు ఈవీవీ అబ్బాయి అల్ల‌రి న‌రేష్‌. మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు సినిమాల్లో కన్నీళ్లు పెట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో తాను న‌వ్విస్తేనే బెట‌ర్ అని ఆ రూట్లోనే ప్ర‌యాణం చేస్తూ వ‌స్తున్నారు. కానీ ఈమ‌ధ్య ఆయ‌న‌కి అంత‌గా క‌లిసి రావ‌డం లేదు. మునుప‌టిలాగా న‌వ్వించ‌లేక‌పోతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్‌లాంటి కామెడీ షోలు వ‌చ్చాక న‌రేష్ నుంచి మ‌రింత కామెడీ మోతాదుని ఆశించ‌డం మొద‌లుపెట్టారు.

Allari Naresh new

ఆ అంచ‌నాల్ని అందుకోలేక చ‌తికిల‌ప‌డిపోయాడు అల్ల‌రోడు. ఈమ‌ధ్య మ‌హ‌ర్షిలో మ‌హేష్‌తో క‌లిసి న‌టించాడు. దాంతోనే విజ‌యం సాధించినంత తృప్తిప‌డిపోయాడు. మ‌ధ్య‌లో `బంగారు బుల్లోడు` అని ఒక సినిమా చేశాడు కానీ.. అది ఇంకా విడుద‌ల కాలేదు. ఇంత‌లో ఆయ‌న మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న‌లో యాక్ష‌న్ కోణాన్ని చూపిస్తూ, ఓ కొత్త సినిమాని ప్ర‌క‌టించేశాడు. 20వ తేదీ ఆ సినిమా మొద‌లు కాబోతోంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తుండ‌డం విశేషం. మ‌రి అల్ల‌రోడు యాక్ష‌న్ అవ‌తారంలోకి మారిన త‌ర్వాతైతే కలిసొస్తుందేమో చూడాలి. ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో కూడిన అల్ల‌రోడి కొత్త లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.