న‌రేష్‌-సునీల్ మ‌ల్టీస్టార‌ర్ ముగింపు

Last Updated on by

అల్లరి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్‌లో భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ జ‌న‌వ‌రిలో మొద‌లై ఇప్ప‌టికే దాదాపు పూర్త‌యింద‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా అటు హీరోలు కానీ, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కానీ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి, రేపో మాపో గుమ్మడికాయ కార్య‌క్ర‌మం చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. `సుడిగాడు సీక్వెల్‌`గా చెబుతున్న ఈ సినిమాని త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `త‌మిఝ్ ప‌దం 2.0` కి రీమేక్‌గా తెర‌కెక్కిస్తున్నారు. `సుడిగాడు` త‌ర‌వాత `స్పీడున్నోడు`తో ఫ్లాప్ అందుకున్న‌ భీమ‌నేనికి ఇది ఎంతో కీల‌క‌మైన సినిమా. అలానే వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌రేష్‌, సునీల్ ఇద్ద‌రికి ఇది ష్యూర్‌షాట్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాల్సిన స‌న్నివేశం. ఇలాంటి కీల‌క‌మైన టైమ్‌లో ఓ రీమేక్‌పై ఆధార‌ప‌డి ఎంత‌వ‌ర‌కూ గ‌ట్టెక్కుతారో అన్న‌ది వేచి చూడాలి. `త‌మిఝ్ ప‌దం` రీమేక్‌గా తెర‌కెక్కిన `సుడిగాడు` ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిందో, అంత‌కుమించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఈసారి కొట్టాల్సి ఉంటుంది.

User Comments