దోస్తానాకు అల్లూవారి పార్టీ

Last Updated on by

ఓవైపు `నా పేరు సూర్య‌` డిజాస్ట‌ర్ ఫ‌లితం వేదిస్తున్నా.. మ‌రోవైపు `మ‌హాన‌టి` స‌క్సెస్ పార్టీ ఇచ్చింది అల్లూ కాంపౌండ్‌. ఇదీ స్పోర్టింగ్ స్పిరిట్ అంటే.. అంటూ మాట్లాడుకుంటున్నారు ఫిలింన‌గ‌ర్‌లో. ఒక మంచి సినిమా తీసిన‌ప్పుడు ప‌క్క‌వాడిని పొగ‌డ‌డం అనే అల‌వాటు అల్లు-మెగా కాంపౌండ్‌కి ఉంది. మంచిని మంచి అని చెప్ప‌డం.. ప‌రిశ్ర‌మ బాగుండాల‌ని కోరుకోవ‌డం ప‌రిశ్ర‌మ పెద్ద‌న్న‌ల పెద్ద‌రికానికి సింబాలిక్‌గా క‌నిపిస్తోంది.

అశ్వ‌నిద‌త్ – వైజ‌యంతి కాంపౌండ్‌లో ఇన్నాళ్టికి ముసిముసి న‌వ్వులు క‌నిపిస్తున్నాయి. భారీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బెంబేలెత్తించాయి ద‌త్ కాంపౌండ్‌ని. చిన్న సినిమాల్లో ప్ర‌యోగాలు వెక్కిరించాయి. అయితే వాట‌న్నిటికీ భిన్నంగా ప‌రిమిత బ‌డ్జెట్‌తో ఎలాంటి స్టార్‌డ‌మ్‌తో ప‌ని లేకుండా తీసిన `మ‌హాన‌టి` ఎంతో న‌మ్మ‌క‌మైన విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా ఇంటా బ‌య‌టా దుమ్ము దులిపేస్తోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా మెరుగైన ఫ‌లితాన్ని అందుకుంటోంది. ఆ క్ర‌మంలోనే సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు `మ‌హాన‌టి` చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదివ‌ర‌కూ ప్ర‌త్యేకించి మ‌హాన‌టి టీమ్‌ని ప్ర‌శంసించి, స‌త్క‌రించారు. ఈ ఆదివారం సాయంత్రం అల్లు కాంపౌండ్ సైతం ప్ర‌త్యేకించి అశ్వ‌నిద‌త్ బృందానికి పార్టీ ఇచ్చి మ‌రీ సెల‌బ్రేట్ చేసింది. ఈ పార్టీలో అల్లు అర‌వింద్ తో పాటు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి పాలుపంచుకున్నారు. అశ్వ‌నిద‌త్‌, నాగ్ అశ్విన్, స్వ‌ప్న‌ద‌త్‌, ప్రియాంక ద‌త్‌, ఎం.ఎం.కీర‌వాణి, విజ‌య్ దేవ‌ర‌కొండ పార్టీలో చిలౌట్ చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఫోటోని సామాజిక మాధ్య‌మంలో పోస్ట్ చేసిన బ‌న్ని ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. “మ‌హాన‌టి` విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా నాన్న‌గారు… ఆయ‌న ఫ్రెండు& పార్ట‌న‌ర్‌ అశ్వ‌నిద‌త్‌గారికి అద్భుత‌మైన పార్టీ ఇచ్చారు. మ‌హాన‌టి టీమ్‌కి, కెప్టెన్‌ నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్‌“ అని కామెంట్‌ని పోస్ట్ చేశారు.

User Comments