చంప‌డానికి రెడీగా ఉన్నారు : అల్లు అర‌వింద్

అల్లు అర‌వింద్ మాట్లాడిన ప్ర‌తీసారి ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీ అయిపోతుంది ఈ మ‌ధ్య‌. కావాల‌నే చేస్తున్నాడో.. లేదంటే అలా వ‌చ్చేస్తున్నాయో మాట‌లు తెలియ‌డం లేదు కానీ వివాదాలు మాత్రం ముంచుకొస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో మీడియాను మ‌రోసారి టార్గెట్ చేసాడు అల్లు అర‌వింద్. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని.. తాను చూసాన‌ని చెప్పిన ఈ మెగా ప్రొడ్యూస‌ర్.. ఆల్రెడీ ఈ సినిమాను చంప‌డానికి కొంద‌రు రెడీగా ఉన్నార‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. తొలిరోజు విడుద‌ల కాగానే దీనికి మిక్స్ డ్ టాక్ తీసుకొచ్చి.. ప్రేక్ష‌కుల‌కు చేరువ కాకుండా చేయాల‌ని ఇప్ప‌టికే తెర‌వెన‌క కొన్ని శ‌క్తులు ప‌ని చేస్తున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు అల్లు అర‌వింద్. అంతేకాకుండా ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా ఖచ్చితంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నాం అని చెప్పాడు ఈ నిర్మాత‌. దీన్నిబ‌ట్టి చూస్తుంటే కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ఇండ‌స్ట్రీ ఉక్కుపాదం మోపేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే ఎవ‌రికి న‌ష్టం.. ఎవ‌రికి లాభం అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఏది ఏమైనా అల్లు అర‌వింద్ మాట‌లు మాత్రం కొంద‌రికి బాగానే షాక్ ఇచ్చాయి.