స్టైలిష్ స్టార్ లో చాలా మార్పు..!

రెండేళ్ల కింద బ‌న్నీ ఇలా లేడు. స‌రైనోడు స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న‌లో మార్పు వ‌చ్చింది. మెగా కుటుంబాన్ని దూరంగా ఉంచాడ‌ని.. సొంత కుంప‌టి పెట్టుకోవాల‌ని చూసాడ‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని కూడా ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌చారం జరిగింది. ఈయ‌న చేసిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్ కామెంట్స్ కూడా దీనికి నిద‌ర్శ‌న‌మే. ఆ త‌ర్వాత కూడా చాలా సార్లు ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని అభిమానుల కోపానికి బ‌ల‌య్యాడు కూడా. అయితే ఇప్పుడు బ‌న్నీలో కావాల్సినంత మార్పు వ‌చ్చింది. ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు మెగా బంధం కోసం పాకులాడుతున్నాడు అల్లు అర్జున్. మొన్న ఫిల్మ్ ఛాంబ‌ర్ ద‌గ్గ‌ర ప‌వ‌న్ ను ఆప్యాయంగా హ‌త్తుకోవ‌డం కానీ.. ఆ త‌ర్వాత మొన్న నా పేరు సూర్య ఆడియో వేడుక‌లో ప‌వ‌న్ ను తెగ పొగిడేయడం కానీ చూస్తుంటే ప‌వ‌న్ విలువ ఇప్ప‌టికి తెలిసొచ్చిందా అనిపిస్తుంది.

ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా మెగా కుటుంబం గురించి చాలా బాగా మాట్లాడాడు బ‌న్నీ. ముఖ్యంగా చ‌ర‌ణ్ ను అయితే ఆకాశానికి ఎత్తేసాడు. మెగా ఫ్యామిలీ అంటే అంతా మ‌న‌దే అన్న‌ట్లు మాట్లాడాడు బ‌న్నీ. చ‌ర‌ణ్ కు ఒక్క హిట్ ప‌డ‌గానే త‌మ్ముడు అనేస్తున్నాడంటూ బ‌న్నీపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. అయితే వాళ్లంతా ఒక్క‌టే అనే వాళ్లు కూడా లేక‌పోలేరు. మ‌రోవైపు అల్లు అరవింద్ కూడా త‌మ‌కు ప‌వ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా అంటున్నాడు. బ‌న్నీలో వ‌చ్చిన ఈ మార్పు చూసి అంతా షాక్ అవుతున్నారు. అభిమానులు అయితే సంతోష ప‌డుతున్నారు. బ‌న్నీ కూడా తాము ఎంత‌మంది హీరోలున్నా కూడా అంద‌రం ఒక్క‌టే.. అంతా క‌లిసే ఉంటాం.. మేమంతా ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చాడు. మ‌రి తెర‌వెన‌క ఏ శ‌క్తి ప‌నిచేసిందో తెలియ‌దు కానీ అల్లు వారబ్బాయి మాత్రం అస‌లు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడిప్పుడు.