సూర్యను బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారా..?

Last Updated on by

ఈ మ‌ధ్యే ఓ పెద్ద సినిమా విడుద‌లైంది. దాని గురించి న‌లుగురు ద‌ర్శ‌కులు.. ఓ హీరో కూర్చుని ఇంట‌ర్వ్యూ చేసుకున్నారు. అది ఇంట‌ర్వ్యూ కూడా కాదేమో..? చ‌నిపోయిన మ‌నిషిని మ‌ళ్లీ బ‌తికించే ప్ర‌య‌త్నం. అదేంటి.. చ‌చ్చాక బ‌తికేది ఏంటి వాడి బొంద అనుకుంటున్నారా..? మ‌రి వీళ్లు చేసిన ఇంట‌ర్వ్యూ కూడా ఇలాగే ఉందిక్క‌డ‌. వాళ్లు తీసిందే ఓ నాసీర‌కం సినిమా. అందులో దేశ‌భ‌క్తి అనే కాన్సెప్ట్ ఒక‌టి పెట్టి.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు తీసేసాడు ఆ ద‌ర్శ‌కుడు. తొలి సినిమాతోనే స్టార్ డైరెక్ట‌ర్ అయిపోదాం అనే కంగారో ఏమో కానీ పాపం నిర్మాత‌ల‌తో 60 కోట్లు ఖ‌ర్చు చేయించాడు. ఇప్పుడు అది ఎలాగూ వెన‌క్కి రాదు. పోనీ ప్ర‌మోష‌న్స్ అయినా స‌రిగ్గా చేసుకుంటున్నారా అంటే అదీ లేదు. పై నుంచి న‌లుగురు ద‌ర్శ‌కుల్ని కూర్చోబెట్టి అంద‌రిపై సెటైర్లు వేయించ‌డానికి ఓ ప్రోగ్రామ్ చేసుకున్నారు.

అందులో ఒక‌రేమో ఇప్పుడున్న రివ్యూ రైట‌ర్ల‌కు సినిమాలు చూడ‌ట‌మే రాదంటాడు..! అవును.. వాళ్ల‌కు సినిమా చూపించ‌డ‌మే దండ‌గ అని మ‌రో ద‌ర్శ‌కుడు వంత పాడ‌తాడు. ఇంకొక‌రు అయితే ఐమాక్స్ లో ఉద‌యం షోకు వ‌చ్చే వాళ్లంతా జ‌డ్జులే.. లెక్క‌లేసుకుంటారు.. పెన్ను పేప‌ర్ ప‌ట్టుకుని వాళ్లే సినిమాల‌ను డిసైడ్ చేస్తుంటార‌ని వెక్కిరిస్తాడు. త‌ర్వాత వాళ్లు ప్లాప్ అన్న సినిమాలే ఆడుతున్నాయంటూ వెకిలి న‌వ్వు ఒక‌టి న‌వ్వుతాడు. రివ్యూ రైట‌ర్ల‌పై అంత ప‌గ పెంచుకునే బ‌దులు.. వాళ్లే మంచి సినిమాలు చేయొచ్చుగా..! అలా జ‌డ్జులు అన్న స‌ద‌రు ద‌ర్శ‌కుడు చేసిన‌వ‌న్నీ నాసీ ర‌కం సినిమాలే. ఒక్క‌టీ కొత్త క‌థ ఉండ‌దు. అన్నీ పాత క‌థ‌లే. మ‌నిషిలోని లోపాల‌ను ఎత్తి చూపిస్తూ ఏదో కామెడీ చేస్తుంటాడు. ఆయ‌న కూడా జ‌డ్జులు అంటూ రివ్యూ రైట‌ర్ల‌ను ఎత్తి చూప‌డ‌మే.

ఇంకొకరేమో ఆరేళ్ల కింద అసలైన హిట్ కొట్టాడు. అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య‌మా అని. గ‌త ఏడాది కూడా బ‌న్నీ లాంటి స్టార్ త‌గిలినా రొటీన్ సినిమా తీసి చివాట్లు తిన్నాడు. ఆయ‌నేమో రివ్యూ రైట‌ర్ల‌ను న‌మ్మ‌కూడదంటూ సెటైర్లు వేయ‌డం. అస‌లు ఆ ఇంట‌ర్వ్యూ వాళ్లు చేసింది.. చ‌చ్చిపోతున్న త‌మ సినిమాను బ‌తికించుకోడానికా.. లేదంటే తాము తీసిన సినిమాలోని లోపాల‌ను ఎత్తి చూపించిన రివ్యూ రైట‌ర్ల‌ను తిట్ట‌డానికో అర్థం కాని ప‌రిస్థితి. నిజంగానే రివ్యూ రైట‌ర్లే సినిమాలు నాశ‌నం చేస్తున్నారంటే రంగ‌స్థ‌లంపై ఎవ‌రూ ఎందుకు కామెంట్ చేయ‌లేదు.. భ‌ర‌త్ అనే నేను బాలేద‌ని ఎవ‌రూ ఎందుకు చెప్ప‌లేదు.. ఇప్పుడు మ‌హాన‌టికి అంతా ఎందుకు చేతులెత్తి దండం పెడుతున్నారు..? త‌ప్పు వాళ్ల‌లో ఉంచుకుని.. పైకి మాత్రం తాము తీసేవ‌న్నీ క‌ళాఖండాలు.. రివ్యూ రైట‌ర్లే చెడ‌గొడుతున్నారంటూ క‌వ‌రింగ్స్ ఎందుకో..?

User Comments