తాజా వివాదం.. రూ.130 కోట్లతో బన్నీ

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ మొదట్నుంచీ వివాదాల్లో చిక్కుకునే కనిపించిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫలితాలతో అయితే, డీజే పై వ్యతిరేకత, బన్నీ పై విమర్శలు వ్యక్తమైన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా డీజే రిలీజ్ అయ్యాక తొలి వారంలోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిందని ప్రకటన విడుదల చేయడంతో పెద్ద వివాదమే రేగింది. ఈ విషయంలో డీజే సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రికార్డులనే బ్రేక్ చేసిందా అంటూ మెగా ఫ్యాన్స్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇదే సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా కొంచెం అతి చేయడంతో లేనిపోని తలనొప్పులతో డీజేకు బొప్పికట్టింది. దీంతో స్వయంగా దిల్ రాజు కూడా కొంత వివరణ ఇచ్చుకుంటూ చాలామందిని కూల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చివరకు బాక్సాఫీస్ వద్ద సినిమాకు కూడా ఫుల్ స్టాప్ పడటంతో.. వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లేనని అనుకున్నాం. కానీ, ఇప్పుడు మళ్ళీ తాజాగా బన్నీ డీజే మరో వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. ఆ స్టోరీలోకి వెళితే, బన్నీ దువ్వాడ జగన్నాథమ్ రీసెంట్ గా అన్ని ఏర్పాట్లు చేసుకుని మలయాళంలో రిలీజ్ అయిన విషయం తెలిసే ఉంటుంది.
అక్కడ ఈ సినిమాకు 1.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడంతో.. ఇప్పుడు డీజే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా రూ. 130 కోట్లు చేసిందని ఎవరో ప్రచారం చేస్తున్నారట. దీంతో డీజే కు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా వివాదం అవుతుంది అన్నట్లుగా.. ఇప్పుడు ఈ సినిమాకు 130 కోట్ల రూపాయలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగే మొదలైంది. మరి ఈ తాజా వివాదంలో వేలు పెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో.. డైరెక్టర్ గాని, నిర్మాత గాని దీనిపై అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదిఏమైనా, కంటెంట్ పరంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్స్ పరంగా తన మార్కెట్ ను నిలబెట్టిన డీజే తో మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్న బన్నీ.. ఇప్పుడు ఈ 130 కోట్ల రూపాయల రూపంలో తాజా వివాదంలో చిక్కుకోవడం చూస్తుంటే.. ఈ మధ్య తన టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు.