ప్ర‌యోగానికి భ‌య‌ప‌డ్డ బ‌న్ని

Last Updated on by

`నా పేరు సూర్య` రిజ‌ల్ట్ బ‌న్నీని ఎంత‌గా క‌ల‌వ‌ర‌పెట్టిందో తెలిసిందే. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డం త‌న‌ని ప‌దే ప‌దే ఆలోచించుకునేలా చేసింది. విక్ర‌మ్‌.కె.కుమార్ దుర‌దృష్ట‌మో ఏమో.. అప్ప‌టికే ఖాయం అనుకున్న త‌న ప్రాజెక్టును పెండింగులో ప‌డేలా చేసింది ఈ వైఫ‌ల్య‌మే. ఆ ప‌రాజ‌యం త‌ర్వాత బ‌న్ని స్క్రిప్టు విష‌య‌మై ప‌దే ప‌దే సీరియ‌స్‌గా ఆలోచించుకునేలా చేసింది. ఇంకా చెప్పాలంటే అత‌డిని పూర్తి క‌న్ఫ్యూజ‌న్‌లోకి నెట్టేసింది ఆ రిజ‌ల్ట్. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిభావంతుడైన విక్ర‌మ్‌.కె సినిమా పెండింగులో ప‌డింది. బ‌న్ని సేఫ్ జోన్ వైపు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.

ఆఫ్ బీట్ సినిమాలు సేఫ్ కాద‌ని.. సేఫ్ గేమ్ ఆడే త్రివిక్ర‌మ్‌కే బ‌న్ని ఓకే చెప్పాడ‌ని మ‌రోమారు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి విక్ర‌మ్‌.కె చెప్పిన క‌థ బ‌న్నికి న‌చ్చ‌లేద‌న్న కోణంపైనే జ‌నంలో ఎక్కువ చ‌ర్చ సాగుతోంది. అయితే రెండో కోణం ప‌రిశీలిస్తే విక్ర‌మ్‌.కె ఆలోచ‌న‌లే వేరు.. ప్ర‌యోగాల మైండ్ సెట్ అది. అత‌డి మైండ్ సెట్‌ అన్ని వేళ‌లా సేఫ్ కాద‌నుకునే మ‌న స్టార్ హీరోల్ని ఒప్పించ‌డం కాస్తంత క‌ష్ట‌మే. అత‌డికి ఓకే చెప్ప‌డం కింగ్ నాగార్జున లాంటి వాళ్ల‌కే సాధ్యం.. ఇదో కొత్త కోణం అన్న చ‌ర్చా సాగుతోంది. బ‌న్ని ఇప్పుడు మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ వినిపించే రెగ్యుల‌ర్ కమ‌ర్షియ‌ల్ సినిమాకే సంత‌కం చేసేందుకు ప్రిపేర‌య్యాడు. మాట‌ల మాయావి ఇప్ప‌టికే బ‌న్నికి రెండు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చాడు కాబ‌ట్టి, అత‌డు చెప్పే క‌థ‌పై బ‌న్నికి పూర్తి కాన్ఫిడెన్స్ ఉండ‌డం అంతే స‌హ‌జం. ఇక‌పోతే బ‌న్ని రిజెక్ట్ చేసిన క‌థ‌నే నేచుర‌ల్ స్టార్ నానీకి వినిపించి విక్ర‌మ్‌.కె ఒప్పించ‌గ‌లిగాడు అంటే ఆ క‌థ‌లో ద‌మ్ము లేదని ఎలా అన‌గ‌లం? క‌థ‌ల ఎంపిక‌లో ఎంతో సెల‌క్టివ్‌గా ఉండే నేచుర‌ల్ స్టార్ నాని… ఏమాత్రం క‌థ‌లో న‌చ్చే పాయింట్ లేక‌పోయినా కాద‌నేవాడు క‌దా?. 13బి, మ‌నం, 24 లాంటి విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల్ని ఎంచుకుని అద్భుతంగా మ‌లిచిన ప్ర‌తిభావంతుడు విక్ర‌మ్‌.కె.కుమార్. అలాంటి ద‌ర్శ‌కుడిని కాద‌న‌డం బ‌న్ని త‌ప్పిదం కాక‌పోవ‌చ్చు. ఆ నిర్ణ‌యం సేఫ్ గేమ్‌కి సంబంధించిన‌ది. అయితే విక్ర‌మ్‌ వినిపించిన క‌థ‌ను ఓకే చెప్ప‌డం నానీ చేసిన‌ తెలివైన ప‌ని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నానీని నెక్ట్స్ లెవ‌ల్లో చూపించే సినిమా ఇది అవుతుంద‌న‌డంలో డౌట్‌ లేద‌ని విక్ర‌మ్‌.కె అభిమానులు భావిస్తున్నారు. ఇక‌పోతే నాని ఇప్ప‌టికే క్రికెట్ నేప‌థ్యంలో `జెర్సీ` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇండియా టీమ్‌లో చేరాల‌నుకునే ఔత్సాహిక క్రికెట్ గ‌ల్లీ బోయ్‌గా నాని ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి వెంట‌నే విక్ర‌మ్‌.కెతో మ‌రో ప్ర‌యోగానికి రెడీ అవుతున్నాడ‌న్న‌మాట‌. మారిన ట్రెండ్‌లో ఇది వ‌ర్క‌వుట‌య్యే ఫార్ములానే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

User Comments