ఈ కొత్త‌వాళ్ల‌పై మోజేంది బ‌న్నీ..?

కెరీర్ మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి క‌నీసం ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తో అయినా ప‌ని చేస్తున్నాడు బ‌న్నీ. అప్పుడెప్పుడో కొత్త‌లో ఆర్య చేసిన త‌ర్వాత మ‌ళ్ళీ ఇన్నేళ్ల‌కు నా పేరు సూర్య అంటూ వ‌క్కంతం వంశీకి అవ‌కాశం ఇచ్చాడు బ‌న్నీ. అందుకే నా పేరు సూర్య కోసం భారీ బ‌డ్జెట్ పెట్టిస్తున్నా కూడా ఏం మాట్లాడ‌ట్లేదు అల్లు వార‌బ్బాయి. ఈ చిత్రాన్ని ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగ‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బ‌డ్జెట్ 60 కోట్లు అని తెలుస్తుంది. పైగా త‌న‌కు కావాల్సిన‌ట్లుగా నా పేరు సూర్య క‌థ‌లో కొన్ని మార్పులు కూడా చేయించుకున్నాడు బ‌న్నీ. ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్. ఈ మ‌ధ్యే ఊటీలో భారీ షెడ్యూల్ జరుపుకుని వ‌చ్చారు బ‌న్నీ అండ్ టీం.

నా పేరు సూర్య త‌ర్వాత బ‌న్నీ సినిమా ఏంటి..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం నిన్న‌టి వ‌ర‌కు లింగుస్వామితోనే అని వ‌చ్చేది. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా సీన్ లోకి మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. అది కూడా కొత్త ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే బ‌న్నీ ఓ క‌థ విన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా నా పేరు సూర్య సెట్ లోనే. ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన లైన్ ఈ హీరోను బాగా ఇంప్రెస్ చేసిందని.. ఆ క‌థ‌పై బ‌న్నీ చాలా ఆస‌క్తిగా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ క‌థ‌ను త‌ను మెచ్చేలా డెవ‌ల‌ప్ చేసి తీసుకొస్తే.. సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు అల్లుఅర్జున్. అది కూడా ఓ ప్రేమ‌క‌థ అని తెలుస్తోంది. అయితే ఆ ద‌ర్శ‌కుడి వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉంచారు అల్లు వర్గాలు. మొత్తానికి కెరీర్ లో సుకుమార్ ను త‌ప్ప కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మ‌ని బ‌న్నీ.. వ‌ర‌స‌గా ఇలా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం వెన‌క ఉన్న మ‌త‌ల‌బేంటో మ‌రి..?