అల్లు అర్జున్ స్పోర్ట్స్ డ్రామా

కథానాయకులకి ఒకొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. వాళ్ల అభిరుచికి తగ్గ కథల్లో నటించే అవకాశం ఎప్పుడో కానీ రాదు. మాకు ఇలాంటి కథలు కావాలని పనిగట్టుకుని రాయించే కథానాయకులు తెలుగులో అరుదు. దర్శకులు తెచ్చిన కథల్లో నటించడమే శ్రేయస్కరం అని నమ్ముతుంటారు. మహా అయితే ఆ కథల్లో కొన్ని మార్పులు చేర్పులు చెబుతుంటారంతే.

అయితే కొద్దిమందికి మాత్రం తొలి అడుగుల్లోనే కోరుకున్న కథలో నటించే అవకాశం వస్తుంటుంది. అల్లు అర్జున్కి ఇప్పటిదాకా ఆ కోరిక తీరనే లేదట. ఆయనకి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనేది ఇష్టమట. స్వతహాగా అథ్లెట్ని అని, నాకు స్పోర్ట్స్ కథలు బాగా సూట్ అవుతాయని అల్లు అర్జున్ చెబుతున్నాడు. కానీ ఇప్పటిదాకా ఏ దర్శకుడు తనకి అలాంటి కథ చెప్పలేదన్నాడు. అవకాశం వస్తే మాత్రం వెంటనే ఓకే చెబుతానని ఆయనన్నాడు. మరి బన్నీకి స్పోర్ట్స్ కథ వినిపించే ఆ దర్శకుడు ఎవరో, బన్నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.